సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన ఎన్నికల ప్రణాళికను వెల్లడించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు చిదంబరం తదితరుల సమక్షంలో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
ఏడాదికి పైగా మ్యానిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేశామని రాహుల్ పేర్కొన్నారు. గతంలో చెప్పిన మేరకు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పునరుద్ఘాటించారు. ఉపాధి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పునరుద్ధరణపై మ్యానిఫెస్టో ప్రత్యేకంగా దృష్టిసారించిందని చెప్పారు. మ్యానిఫెస్టో వాస్తవ అంశాలనే ప్రతిపాదించామని అన్నారు.
దేశవ్యాప్తంగా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కోట్ల నగదు సాయం తమ ఎన్నికల ప్రణాళికలో అత్యంత కీలకమని రాహుల్ చెప్పుకొచ్చారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ పీ చిదంబరం మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు దేశంలో కోట్లాది మంది గొంతుకను ప్రతిబింబిస్తాయని అన్నారు.
ఎన్నికల ప్రణాళిక కసరత్తును చేపట్టేముందు వివిధ వర్గాలతో విస్తృత సంప్రదింపులు చేపట్టామని చెప్పారు. రైతులు, యువత, మహిళలు, పరిశ్రమలు, మైనారిటీలు, విద్య, వైద్యం, జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలకాంశాలను తమ ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు.
మ్యానిఫెస్టోలో ప్రధాన హామీలివే..
పేదలకు కనీస ఆదాయ హామీ పధకం
నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72వేల ఆర్ధిక సాయం
ప్రత్యేకంగా కిసాన్ బడ్జెట్
ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ
ఉపాధి హామీ పధకం 100 రోజుల నుంచి 150 రోజులకు విస్తరణ
విద్యారంగానికి బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు
ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ
యువతకు మూడేళ్లపాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే వెసులుబాటు
Comments
Please login to add a commentAdd a comment