జస్మీత్‌కు డేరా బాధ్యతలు | Gurmeet Ram Rahim's Son Jasmeet Insan to Lead Dera Sacha Sauda | Sakshi
Sakshi News home page

డేరాలోనే సినిమా థియేటర్, సెట్టింగులు

Published Wed, Aug 30 2017 8:55 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

జస్మీత్‌కు డేరా బాధ్యతలు

జస్మీత్‌కు డేరా బాధ్యతలు

గత సంప్రదాయాలకు భిన్నంగా వారసుడికే పగ్గాలు
సిర్సా, కురుక్షేత్ర:
గుర్మీత్‌ రామ్‌ రహీం జైలు కెళ్లడంతో తదుపరి డేరా చీఫ్‌ ఎవరన్న ఊహాగానాలకు తెరపడింది. గుర్మీత్‌ కుమారుడు జస్మీత్‌ ఇన్సాన్‌ను మంగళవారం డేరా తదుపరి వారసుడిగా నియమించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ప్రస్తుత చీఫ్‌ కుటుంబానికి చెందిన వ్యక్తికే డేరా సచ్చా సౌదా పగ్గాలు అప్పగించారు.

దత్త పుత్రికగా పేర్కొంటున్న హనీప్రీత్, డేరా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ పేర్లు విన్పించినా చివరకు జస్మీత్‌కే అవకాశం దక్కింది. వ్యాపారస్తుడైన జస్మీత్‌ పంజాబ్‌ మాజీ ఎమ్మెల్సీ హర్మీందర్‌ సింగ్‌ కుమార్తెను పెళ్లిచేసుకున్నారు. నిజానికి 2007లో గుర్మీత్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పుడే జస్మీత్‌ను వారసుడిగా ప్రకటించినట్లు సమాచారం.  

15 ఏళ్లుగా నరకం..
గుర్మీత్‌పై న్యాయపోరాటంలో 15 ఏళ్లుగా లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయని, తన సోదరుడిని హతమార్చారని, తన కుటుంబం ఎంతో మానసిక క్షోభ అనుభవించిందని బాధితురాళ్లలో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్మీత్‌కు జైలు శిక్షతో ఊరట దక్కినా.. తన తమ్ముడి హత్య కేసులో తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని ఆమె తెలిపారు. ‘అమ్మాయిల్ని డేరా చీఫ్‌ తన గుహ ముందు కాపలా పెట్టేవాడు. కొందరు అమ్మాయిలు గుహ నుంచి బయటకు వస్తూ ఏడ్చేవారు.

నన్ను కూడా శారీరకంగా వేధించాడు. ఎంతో మందిని శారీరకంగా వేధించినా.. అవమాన భయంతో చాలా మంది మౌనంగా ఉండిపోయారు’ అని బాధితురాలు చెప్పారు. గుర్మీత్‌ అకృత్యాలపై అప్పటి ప్రధాని, పంజాబ్, హరియాణా హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖల వెనుక బాధితురాలి తమ్ముడు ఉన్నాడని అనుమానిస్తూ 2002లో అతన్ని హత్య చేశారు.  

డేరా దాదాపుగా ఖాళీ
డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం నుంచి గుర్మీత్‌ అనుచరుల్ని ఖాళీ చేయించేందుకు ఆర్మీ ఆపరేషన్‌ మంగళవారం కూడా కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి దాదాపు 700 మంది అనుచరుల్ని ప్రత్యేక బస్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించామని హరియాణా సమాచార శాఖ అధికారి తెలిపారు. ఇంకా దాదాపు 200 మంది ఉద్యోగులు ప్రధాన కార్యాలయంలోనే ఉన్నట్లు సిర్సా డీసీపీ ప్రభ్‌జోత్‌ సింగ్‌ చెప్పారు.

18 మంది మైనర్‌ బాలికలు డేరా నుంచి వచ్చేందుకు నిరాకరించారని, అయితే వారిని ఒప్పించి అనంతరం బాలికల సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. సోమవారం 34 మంది మైనర్‌ బాలురను డేరా నుంచి తీసుకొచ్చినట్లు డీసీపీ వెల్లడించారు. గత రెండు రోజుల్లో 6,500 మంది గుర్మీత్‌ అనుచరుల్ని పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని వారి స్వగ్రామాలకు పంపారు.

ఇంటర్నెట్‌పై కొనసాగుతున్న నిషేధం
గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ సోమవారం రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోలేదని రోహ్‌తక్‌లోని సునరియా జైలు అధికారులు తెలిపారు. రాత్రి కేవలం మంచినీరు మాత్రమే తాగారని, మంగళవారం ఉదయం పాలు తీసుకున్నారని వారు చెప్పారు. కాగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ హరియాణాలోని సున్నిత ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.    

డేరాలోనే సినిమా థియేటర్, సెట్టింగులు
డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ విలాసాలు, వైభోగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సినిమా నటనను ఎంతో ఇష్టపడే గుర్మీత్‌ డేరా ప్రధాన కార్యాలయంలోనే సకల హంగులతో సినిమా థియేటర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆయన నటించే సినిమాల్ని నిర్మించేందుకు వీలుగా డేరాలోనే ఖరీదైన ఇన్‌డోర్, అవుట్‌ డోర్‌ సెట్‌లు కూడా ఉన్నాయి. త్వరలో విడుదల కావాల్సిన ‘ఆన్‌లైన్‌ గురుకుల్‌’ కోసం ఇటీవలే ఆ సెట్స్‌లో కొన్ని రోజులు షూటింగ్‌ చేశారు.

‘దాదాపు 70 శాతం బాబా సినిమాల షూటింగ్‌ ప్రధాన కార్యాలయంలో జరుగుతాయి. అవసరమైతే క్యాంపస్‌లోని స్కూళ్లు, కాలేజీల్ని వాడేవారు. బాబా సినిమా విడుదలకు ముందే సినిమా చూడమని అనుచరులందరికీ ఎస్‌ఎంఎస్‌లు వెళ్తాయి’ అని గుర్మీత్‌ అనుచరుడు ఒకరు వెల్లడించారు. అలాగే గుర్మీత్‌కు కార్లంటే చాలా ఇష్టం. అతని కాన్వాయ్‌లో ఎప్పుడూ ఒకే రంగులో నాలుగైదు ఖరీదైన కార్లు ఉండేవి. ప్రాణహాని ఉండటంతో తాను ఏ కారులో ఉన్నాడో తెలియకుండా ఉండేలా ఈ ఏర్పాటు. ఆయన మహిళ గార్డుల్ని కూడా నియమించుకున్నారు.

Advertisement

పోల్

Advertisement