గుర్మీత్ కూతురిపై లుక్‌ఔట్ నోటీసు
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు పాలైన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, ఆయన కీలక అనుచరులపై హరియాణా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచిపోయే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, బస్సులు, రైల్వే స్టేషన్లను అలర్ట్ చేశారు. గుర్మీత్ జైలు నుంచి తప్పించుకొని పోయేందుకు కుట్ర పన్ని అరెస్టయిన డేరా సచ్చాకు చెందిన ఓ ముఖ్యమైన వ్యక్తిని విచారించిన అనంతరం ఈ నోటీసు లిచ్చారు.
గుర్మీత్‌కు సంబంధించి కొన్ని అంశాల విషయంలో హనీప్రీత్‌ను, డేరా అధికార ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్ చావ్లా పేర్కొన్నారు. ‘అరెస్టయిన సురీందర్ ధిహమ్ ఇన్సాన్‌ను ప్రశ్నించగా.. హనీప్రీత్, ఆదిత్య దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని చెప్పాడు. అందుకే వారిపై నోటీసులు జారీ చేశాం’అని చావ్లా తెలిపారు. గుర్మీత్ తప్పించుకొని పోయేందుకు చేసిన కుట్రలో పోలీసుల హస్తంపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కాగా, గుర్మీత్‌కు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల కారణంగా మృతుల సంఖ్య 41కి చేరింది. గుర్మీత్‌కు సెక్యూరిటీగా ఉన్న ఐదుగురు హరియాణా పోలీసులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి వారిని సర్వీసు నుంచి తొలగించారు.