
మైసూరు రాచ కుటుంబం చివరి వారసుని కన్నుమూత
మైసూరు సంస్థానం చివరి రాజు జయచామ రాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ (60) మంగళవారం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య ప్రమోదాదేవి ఉన్నారు. సంతానం లేదు. బెంగళూరులోని నివాసంలో ఆయనకు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో వెంటనే విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా యత్నించినా ఫలితం లేకపోయింది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మదన్ కుమార్ ప్రకటించారు. భర్త మరణవార్త తెలియడంతో మైసూరులో ఉన్న ప్రమోదాదేవి హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. ఒడయార్ భౌతికకాయానికి బుధవారం మైసూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడించారు. ఒడయార్ మృతితో కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఒడయార్ 1974లో మైసూరు సంస్థాన బాధ్యతలను స్వీకరించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి ఒడయార్ 4 సార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు.