
మౌన రోదన
రాచ నగరిలో నిశ్శబ్దం..
= ఒడయార్ మృతితో తల్లడిల్లిన నగరం
= అంతిమ దర్శనానికి భారీగా జనం
= శోకసంద్రమైన రాజ ప్రాసాదం
= నగరంలోని కూడళ్లలో ఆయన చిత్రపటాలుంచి శ్రద్ధాంజలి
= నగరంలో స్వచ్ఛంద బంద్
= మధువనంలో అంత్యక్రియలు
= సౌధపై జాతీయ పతాకం అవనతం
= వారసుడిగా కాంతరాజ అర్స్!
మైసూరు, న్యూస్‌లైన్ : సుమారు ఐదున్నర శతాబ్దాల పాటు తమ ఏలికగా ఉన్న ఒడయార్ రాజ వంశం అంతమవడంతో రాచ నగరి మైసూరు తల్లడిల్లిపోయింది. మైసూరు రాజుల్లో ఆఖరి వారైన శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ పార్థివ శరీరం మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి మైసూరు చేరుకున్నప్పటి నుంచి తండోప తండాలుగా ప్రజలు రాజ ప్రాసాదానికి తరలి వచ్చారు.
పలు సార్లు తొక్కిసలాట ఏర్పడింది. రాష్ర్టంలోని నలుమూలల నుంచి, ముఖ్యంగా మైసూరు, చామరాజ నగర, మండ్య జిల్లాల ప్రజలు వేల సంఖ్యలో అంతిమ దర్శనానికి తరలి వచ్చారు. ఒడయార్ మరణ వార్త తెలియగానే రాచ నగరిలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. పలు కూడళ్లలో ఆయన చిత్ర పటాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. నగరమంతా ఆయన మరణం గురించే మాట్లాడుకోవడం కనిపించింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
మధ్యాహ్నం వరకు అంతిమ దర్శనానికి అవకాశం కల్పించి, అనంతరం రాజప్రాసాదం ద్వారాలన్నీ మూసివేశారు. తర్వాత యదు వంశ రాయుని బంధువులు అంత్యక్రియలకు ముందు నెరవేర్చాల్సిన ధార్మిక కార్యక్రమాలను పూర్తి చేశారు. మైసూరు చుట్టు పక్కల దేవస్థానాల నుంచి తీసుకొచ్చిన తీర్థాన్ని భౌతిక కాయంపై చల్లారు. తదనంతరం రాజప్రాసాదం నుంచి సయ్యాజీ రావు సర్కిల్, అరసు రోడ్డు, నారాయణ శాస్త్రి రోడ్డు, చాముండి డబుల్ రోడ్డుల మీదుగా అంతిమ యాత్రను నిర్వహించి నంజనగూడు రోడ్డులోని మధువనంలో అంత్యక్రియలను నిర్వహించారు. భానుప్రకాశ్ శర్మ నేతృత్వంలో 25 మంది వేద పండితులు అంత్య సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వారసుడిగా కాంతరాజ అర్స్
సంతానం లేని ఒడయార్ అంత్యక్రియలను ఆయన మేనల్లుడు కాంతరాజ్ అర్స్ నిర్వహించారు. ఒడయార్ పెద్ద సోదరి గాయత్రీ దేవి కుమారుడైన కాంతరాజ్ తదుపరి వారసుడవుతారని వినవస్తోంది. ఒడయార్‌కు మరో సోదరి మీనాక్షి దేవి కూడా ఉన్నారు. వీరిద్దరి కుమారుల్లో వారసుడిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ నెలకొన్నా.. పెద్ద సోదరి కుమారుడికే ఆ గౌరవం లభించవచ్చని తెలుస్తోంది.
ప్రముఖుల శ్రద్ధాంజలి
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రి వర్గ సహచరులు అంబరీశ్, కేజే. జార్జ్, హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్, డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప, వీ. శ్రీనివాస ప్రసాద్, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, యడ్యూరప్ప ప్రభృతులు పార్థివ శరీరంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. సుత్తూరు మఠాధిపతి శ్రీ శివరాత్రీశ్వర దేశికేంద్ర స్వామీజీ అంతిమ దర్శనం చేసుకుని, రాణి ప్రమోద దేవికి సాంత్వన పలికారు.
బెంగళూరులో..
ఒడయార్ మృతికి సంతాప సూచకంగా నగరంలోని కేఆర్ మార్కెట్‌లో వర్తకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మేయర్ సత్యనారాయణ స్కూటర్‌పై వచ్చి ఒడయార్‌కు నివాళులర్పించారు. పుట్టణ్ణ శెట్టి టౌన్ హాలు వద్ద ఒడయార్ చిత్ర పటాన్ని పెట్టి పూజలు నిర్వహించారు. పలువురు నివాళులు అర్పించారు. ప్యాలెస్, నవరంగ్ తదితర చోట్ల కూడా ఒడయార్ చిత్ర పటాలుంచి సంతాపం వ్యక్తం చేశారు. విధాన సౌధపై జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.