
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత కన్నుమూత
గత నెలలో కాల్పులకు గురైన ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బ్రిగెడియర్ (రిటైర్డ్) జగదీష్ గగ్నేజా (68) గురువారం ఉదయం మరణించారు. లూథియానా లోని హీరో డీఎంసీ హార్ట్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ పంజాబ్ ఉపాధ్యక్షుడైన గగ్నేజా.. ఆర్ఎస్ఎస్-బీజేపీలలో కీలక నాయకుడు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయనను పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయానికి బాటలు పరుస్తారని అంతా భావించారు.
భారత సైన్యంలో చేరడానికి ముందు ఆయన ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్‌గా పనిచేశారు. 40 ఏళ్లపాటు సైన్యంలో చేసిన తర్వాత మళ్లీ ఆర్ఎస్ఎస్‌లోకి సంఘ్‌చాలక్‌గా వచ్చారు. ఆగస్టు ఏడో తేదీన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆయనపై అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతోఅప్పుడే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి బాగా విషమించిందని, బీపీ బాగా పడిపోవడంతో గురువారం ఉదయం 9.16 గంటలకు మరణించారని వైద్యులు ప్రకటించారు.