
ఆర్ఎస్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం
జలంధర్: పంజాబ్ లో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బిగ్రేడియర్(రిటైర్డ్) జగదీశ్ గగనేజపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. జలంధర్ లోని జ్యోతి చౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి కారులో వెళుతున్న జగదీశ్ పై బైకుపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన దేహంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. జగదీశ్ పై దాడిని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఖండించారు. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెంచారు.