
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరి నదిలో మానవ వ్యర్థాలు, మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం కారణంగా జలాలు కలుషితమయ్యాయని, గోదావరి నదిని ప్రక్షాళన చేయాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయను గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు. ‘గోదావరి నదిని శుభ్రపరచాలని కేంద్ర మంత్రిని కోరుతున్నాను. అనేక పరిశ్రమల వ్యర్థాలను నదిలోకి వదులుతున్నారు. నదిని శుభ్రం చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించాలి. అలాగే నదిలోకి ప్రవహిస్తున్న మురుగునీటి పారుదల కాలువలను మూసేయాలి. దీనికి వీలుగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించాలి. జాతీయ నదీ సంరక్షణ సచివాలయం నిధులు కేటాయించి నదిలోని బ్యాక్టీరియా తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలి. 500 యూనిట్ల కంటే ఎక్కువగా ఇ.కొలి బ్యాక్టీరియా నీటిలో ఉంటే అది ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారవుతుంది. అందువల్ల కేంద్రం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలి.’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment