
కన్నీరొలికిన కాలం సాక్షిగా
తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. రణరంగాలైన విశ్వవిద్యాలయాలు ఆనంద తాండవమాడుతున్నాయి. నోళ్లు తెరిచిన జైళ్లు నవ్వులు చిందిస్తున్నాయి. లాఠీలకు, తూ టాలకు, రైళ్లకు ఎదురొడ్డి నిలిచి, చెట్లకు వేలాడి, భగ్గున మండిన బిడ్డల త్యాగాల పంటను చూసి తల్లుల కళ్లు చెమరుస్తున్నాయి. కన్నీరొలికించిన కాలం సాక్షిగా, నెత్తురు చిందించిన చరిత్ర సాక్షిగా తెలంగాణ కన్ను తెరిచింది.
రగిలిన విద్యార్థి హృదయాల నుంచి, అవి ఒలికించిన నెత్తుటి మడుగుల నుంచి మొలిచిన 1953 ముల్కీ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరి పోసింది. 370కి పైగా విద్యార్థి. యువత గుండె నెత్తురులతో ప్రజ్వరిల్లిన ‘1969’ ఆ ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటింది. వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకత్వం తెలంగాణ ఆకాంక్షను పదవులుగా సొమ్ము చేసుకుంది. దగాపడ్డ తెలంగాణ కోస్త్రాంధ్ర భూస్వామ్య శక్తుల అణచివేతకు గురైంది. దాదాపు రెండు దశాబ్దాల ఆ చీకటి కాలం మరో ఉద్యమ వెల్లువను కడుపున మోసింది. 1990లలో ఆవిర్భవించిన తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి సంస్థలు నివురుగప్పిన నిప్పును ఊది ఊది మండించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మలి దశకు నాంది పలికాయి.
ఈ దశలోనే చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణను రక్తసిక్తం చేసింది. తెలంగాణ కోసం గళమెత్తిన బెల్లి లలిత, ఐలన్న వంటి కళాకారులను పాశవికంగా బలిగొంది. 2001లో టీఆర్‌ఎస్ పుట్టడానికి ముందటి ఈ రక్తసిక్త చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అయినా కొందరు 2001లో లేదా జేఏసీ ఏర్పడ్డ 2009లో ఈ మలి దశ ప్రారంభమైందంటూ కొందరు కట్టుకథలను చరిత్రగా అమ్మే ప్రయత్నం చేస్తుండటం నీతి బాహ్యం. నాటి బలిదానాల కొనసాగింపుగా జరిగినవే 2009 నాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, మిలిటెంట్ విద్యార్థి పోరాటాలు, వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, వెయ్యి మంది ఆత్మ త్యాగాలు. నెత్తుటి పొద్దయి మొలిచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఖ్యాతి ఏ ఒక్కరిదో కానే కాదు. ఇది ప్రజలందరి పోరాటాల విజయం.
ముంచు ‘వరం’ ముప్పు: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినందుకు సంబురాలు జరుపుకుందాం. కానీ మన మూలాలను ముంచెత్తే పోలవరం ప్రాజెక్టు మీదుగా తెలంగాణ వచ్చిందనే విషాదకర వాస్తవాన్ని విస్మరించలేం. ఏ నాగరిక సమాజపు చారిత్రక, సాంస్కృతిక మూలాలు ఆదివాసుల్లోనే నిలిచి ఉంటాయి. పోలవరం ముంచెత్తనున్న ఆదివాసి ప్రాంతాలతో పాటే మన తెలంగాణ కుదుళ్లు కూడా శాశ్వతంగా అదృశ్యం కానున్నాయి. విశాఖలో బహుళ జాతి కంపెనీల కోసం ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్ అవసరాలే పోలవరం నిర్మాణపు ప్రధాన లక్ష్యమని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నాడు. వెంకయ్యనాయుడుతో కుట్ర చేసి ఆసాధారణమైన ఆర్డినెన్స్‌ను తెచ్చి ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అందుకే ఇక్కడ మనం విజయోత్సవాలు జరుపుకుంటుండగా అక్కడ ఆదివాసులు నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వపు ప్రజా ఎజెండాలో మొదటి అంశం పోలవరం ముంచేయనున్న ఆదివాసుల పరిరక్షణే కావాలి.
సాగు నీరు: మూడు జీవ నదులున్నా నేల తల్లి దాహార్తిని తీర్చలేని రైతాంగానికి తెలంగాణ రావడమంటే సాగు నీరు రావడమేనని ఆశలు కల్పించాం. వాటిని తీర్చడమే తొలి ప్రభుత్వపు ఎజెండాలోని రెండో అంశం కావాలి. భూములు పడావులు పడగా, పొట్ట చేతబట్టుకుని రైతులు, కూలీలు పట్టణాలకు తరలుతున్న దైన్య గ్రామీణ తెలంగాణకు కావాల్సింది ప్రజలను నిరాశ్రయులను చేసే పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు కావు. చిన్న చిన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్నిచ్చి తక్కువ వ్యయాలతో ఎక్కువ ప్రయోజనాలను సాధించాలి. కాకతీయులు గొలుసుకట్టు చెరు వులతో లక్షలాది ఎకరాలకు నీరందించారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాల ఫలితంగా అవి పూడుకుపోవడమో, తెగిపోవడమో జరిగింది. కొత్త ప్రభుత్వం వాటితో పాటూ జూరాల, సాగర్, శ్రీరాంసాగర్ ఎడమ కాల్వలకు మరమ్మతులు చేయిం చాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేయాలి.
పారిశ్రామిక రంగ పునరుజ్జీవం: చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలోని వేలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఆల్విన్, హెచ్‌ఎంటీ, డీబీఆర్, అజాంజాహీ మిల్లు అందులో మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ పరిశ్రమలను పునరుద్ధరించి, వ్యవసాయాధార పరిశ్రమలను, చేతివృత్తులను ప్రోత్సహించి పారిశ్రామికీకరణకు నూతనోత్తేజాన్ని కల్పించడమే నూతన ప్రభుత్వానికి ప్రజల మూడో ఎజెండా. తెలంగాణ రావడమంటే ఉపాధి అవకాశాలు కలగడమేనని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మాదిగ, కమ్మరి, కుమ్మరి, చేనేత వృత్తుల వాళ్లంతా ధ్వంసమైన తమ వృత్తులకు మంచి రోజులు రావడమేనని నమ్ముతున్నారు. కొత్త ప్రభుత్వం తక్షణమే ఆ వృత్తులను నవీకరించి పోటీ ప్రపంచంలో నిలిచేలా నిలపాల్సి ఉంది. అందుకు స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే మార్గం.
విద్యారంగ పునర్నిర్మాణం: తెలుగు భాష నిరాదరణకు గురైన నిజాం పాలనలో 4 శాతం అక్షరాస్యతతో తెలంగాణ దేశంలోనే వెనుకబడిపోయింది. ఆ తదుపరి కోస్తా కమ్మ దొరల, పెట్టుబడిదారుల పాలనలో వివక్షకు గురై విద్యారంగం పుంజుకోలేకపోయింది. తెలంగాణ భాష, సాహిత్యం నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ చరిత్రకు పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కకుండా పోయింది. బాబు ‘విజన్-2020’ విద్యారంగం 70% పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. చదువు అంగడి సరుకుగా మారి పేదలు, బడుగు వర్గాలకు అందకుండా పోయింది. దళితుల్లో 10%, బీసీల్లో 12%, ముస్లింలలో 8% మాత్రమే ఉన్నత విద్యకు నోచుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకు కళ్లెం వేసి, ఉన్నత విద్యకు బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించడం కొత్త ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ కృషికి సహకరించి విద్యాప్రమాణాలను, నాణ్యతను పెంచాల్సిన బాధ్యత గురువులు, నిపుణులు, పౌరప్రభుత్వానిది.
తెలంగాణ ఉద్యమంలో ఎనలేని త్యాగాలు చేసిన విద్యార్థి, యువత తెలంగాణతోపాటే ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. వాటిని నెరవేర్చడమే ఐదో ఎజెండా. తెలంగాణలో గుర్తించిన ఖాళీలే లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి వాటిని భర్తీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైరె జ్ చేస్తామనే వాగ్దానాన్ని తు.చ. తప్పక నెరవేర్చాలి. ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగాలను రద్దు చేసి పూర్తి కాలం ఉద్యోగులను నియమించాలి. స్థానిక వనరులతో చిన్న పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి పథకాలతో యువత శక్తులను తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా వినియోగించుకోవాలి. త్యాగాలను చాలు బోసిన అమరుల కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి. తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలిపిన కవులు, కళాకారులకు తగు గుర్తింపును, సహాయాన్ని అందించాలి. ప్రజా కళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. తీవ్ర అణచివేతకు గురైన పౌర, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అంతిమంగా ప్రజాస్వామిక విలువలు పరిఢవిల్లే తెలంగాణ ను రూపొందించుకోవాలి.
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్)
డాక్టర్ సి. కాశీం