సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను 2018 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. డిపార్ట్‌మెంటల్ అండర్ టేకింగ్స్–పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు వారి విశిష్ట పనితీరు, వినూత్న సామర్థ్యాలు, ఉత్పాదకత రంగంలో అత్యుత్తమ సహకారం, అసాధారణమైన ధైర్యానికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. శ్రమ్ భూషణ్ అవార్డ్, శ్రమ్‌వీర్ అవార్డ్, శ్రమ్‌శ్రీ అవార్డులుగా ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను మూడు కేటగిరీల్లో అందించనున్నారు.
ఈ సంవత్సరానికి ప్రకటించిన మొత్తం శ్రమ్ అవార్డుల సంఖ్య 33 ఉండగా, అవార్డులను 69 మంది కార్మికులు అందుకుంటున్నారు. శ్రమ్‌శ్రీ అవార్డును అందుకునే వారిలో తెలంగాణ నుంచి కొరివి రమేశ్, పట్లూరి రాజశేఖర్, కొట్టె రాజు (హైదరాబాద్– బీహెచ్‌ఈఎల్), చాడ సురేందర్‌రెడ్డి, పూస రాము (బ్రహ్మోస్ ఏరో స్పేస్ ప్రై.లి.) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2017–18, 2018–19 సంవత్సరాలకు జాతీయ యువ పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ప్రదానం చేశారు. వ్యక్తిగత కేటగిరీలో 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన మహ్మద్ ఆజంకు జాతీయ యువ పురస్కారాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment