స్టార్‌.. కెమెరా.. ఎలక్షన్‌ | Bollywood in Indian Political History | Sakshi
Sakshi News home page

స్టార్‌.. కెమెరా.. ఎలక్షన్‌

Published Fri, Mar 29 2019 11:49 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Bollywood in Indian Political History - Sakshi

రంగుల తెరపై తళుక్కుమంటూ గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలిన వారు.. పొలిటికల్‌ ‘గ్రామర్‌’ను ఆకళింపు చేసుకోగలరా?.. మేకప్‌ మెరుపులతో అలరించే తారలు.. రణతంత్రపుజిత్తులలో రాణించగలరా? అందచందాలు ఒలకబోసి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన వారు.. బ్యాలెట్‌ బాక్స్‌ ఓట్లు రాల్చగలరా? రాజకీయానికి, రంగుల ప్రపంచానికి ఏమిటీ బంధం? ఎందుకింత అనుబంధం? ప్రస్తుత ఎన్నికల్లో తారలు దిగివచ్చిన వేళ.. ఓట్లు నడిచొస్తాయా?. ఈ నయా ఎలక్షన్‌ సినిమా బ్యాలెట్‌

బాక్స్‌ దగ్గర హిట్‌ కొట్టేదెవరో?!
బాలీవుడ్‌నైనా, టాలీవుడ్‌ౖనైనా, కోలివుడ్‌నైనా మకుటం లేని మహారాజుల్లా, మహారాణుల్లా ఏలినవారంతా ఎన్నికల రణక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిన్నటికి నిన్న అలనాటి అందాల తార జయప్రద కాషాయం కండువా కప్పుకొని రామ్‌పూర్‌ నుంచి సమరశంఖాన్ని పూరించడానికి సిద్ధమవుతోంటే, ఇన్నాళ్లూ బీజేపీ ఎంపీగా ఉంటూ సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్‌లోకి ఫిరాయించి బిహార్‌లో పట్నా సాహిబ్‌ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మరే తార చేయని సాహసం ఈసారి మన తెలుగమ్మాయి సుమలత చేశారు. భర్త అంబరీష్‌ మృతి తర్వాత కర్ణాటకలో మండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. టికెట్‌ దక్కకపోయినా నిరాశ చెందక స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగి, మరో యువ నటుడు, దేవెగౌడ మనవడు నిఖిల్‌తో ఢీకొంటున్నారు. సుమలతకి బీజేపీ బాహాటంగానే మద్దతు పలకడంతో ఆమె ప్రచారంలో మరింత ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నారు. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా విలక్షణమైన బాటలో నడుస్తున్న ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిచి సై అంటున్నారు. ఇక కాంగ్రెస్‌ గూటికి చేరిన రంగీలా ఫేమ్‌ ఊర్మిళ ఉత్తర ముంబై నుంచి బరిలో దిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హేమమాలిని మధుర బరిలోకి దిగడమే కాదు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నారు. రాజకీయాల్లోకి సినీతారల్ని తెచ్చి గ్లామర్‌ని పెంచే పని కాంగ్రెస్‌ మొదలు పెడితే బీజేపీ దానిని అందిపుచ్చుకుంది. ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ అందులో ఆరితేరిపోయింది. మూన్‌మూన్‌ సేన్, మిమి చక్రవర్తి, నస్రత్‌ జహాన్‌ తారల తళుకుబెళుకులతో తృణమూల్‌ ఓట్లు దండుకునే పనిలో ఉంది.

తారల తొలి అడుగులివే..
సినీతారలు తమ గ్లామర్‌నే పెట్టుబడిగా పెట్టి నాలుగు ఓట్లు సంపాదించడం కొత్తేం కాదు. మన ఎన్నికల వ్యవస్థలో ఆది నుంచి ఈ ధోరణి కనిపిస్తూనే ఉంది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో నటులు హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ, పైడి లక్ష్మయ్య లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గర తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు.

ఎవరు హిట్‌? ఎవరు ఫ్లాప్‌?
2014 లోక్‌సభ ఎన్నికల్లో సినిమా నటీనటులు రికార్డు స్థాయిలో పోటీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 22 మంది లోక్‌సభ బరిలోకి దిగారు. వీరిలో 12 మంది గెలిస్తే, 10 మంది ఓడిపోయారు. దేవ్, హేమమాలిని, కిరణ్‌ఖేర్, మూన్‌మూన్‌ సేన్, పరేష్‌ రావెల్, చిరాగ్‌ పాశ్వాన్, ఇన్నోసెంట్, మనోజ్‌ తివారీ, మురళీమోహన్, సం«ధ్యారాయ్, శతాబ్ది రాయ్, బాబుల్‌ సుప్రియో నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టారు.
రాఖీ సావంత్, మహేష్‌ మంజ్రేకర్, అపరాజిత మొహంతీ, జావేద్‌ జాఫ్రే, నగ్మా, నవనీత్‌ కౌర్‌ రాణా, రమ్య, రవికిషన్, బప్పీలహరి, గుల్‌ పానగ్‌లు ఓటమి పాలై ఇంటిదారి పట్టారు.

తారా తోరణం
కొందరు తారలు ఉంటారు. వారికి రాజకీయాలంటే ఆసక్తి ఉంటుందో లేదో కానీ ప్రధాన రాజకీయ పార్టీలు వారిపై వల విసురుతాయి. రారమ్మంటూ పార్టీ కండువాలు కప్పుతాయి. వాళ్లకున్న జనాదరణ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తాయి. అలా సినీ రంగానికి చెందిన వారికి లోక్‌సభ టికెట్లు ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది బీజేపీయే. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 18 మంది సినీ తారల్ని ఎన్నికల బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్‌ 17 మంది తారలకి టికెట్లు ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. ఇవే కాకుండా డీఎంకే, జనతాదళ్, ఎస్పీ, టీఆర్‌ఎస్, ఎల్‌జేపీ, ఎంఎన్‌ఎస్‌ వంటి పార్టీలు సినీ తారల్ని లోక్‌సభ బరిలో దింపి తమ సీట్లను పెంచుకున్నాయి. ఇలా మొత్తమ్మీద ఎన్నికల చరిత్రలో 58 మంది తారలు లోక్‌సభ బరిలో నిలిస్తే, 39 మంది పార్లమెంటులో అడుగు పెట్టారు. 19 మంది ఓటమిపాలయ్యారు.

రెండో చాన్స్‌ ప్లీజ్‌
కొంతమంది సినీ తారలు  కేవలం ఒకసారి మాత్రమే గెలిచి రాజకీయాలకు దూరమైతే, మరికొందరు సెకండ్‌ చాన్స్‌లో హిట్‌ కొట్టారు. సునీల్‌దత్, వినోద్‌ ఖన్నా, శత్రుఘ్నసిన్హా, రాజ్‌బబ్బర్, జయప్రద, మహేష్‌ కుమార్, శతాబ్ది రాయ్, సిద్ధాంత మహాపాత్ర, వైజయంతిమాల, అంబరీష్‌లు రెండుసార్లు లోక్‌సభకుఎన్నికై పొలిటికల్‌ స్టార్‌లు అనిపించుకున్నారు.

సెల్యులాయిడ్‌ మినిస్టర్స్‌ వీరే
పొలిటికల్‌ అవతారం ఎత్తి లోక్‌సభలోకి అడుగు పెట్టాక మంత్రులుగారాణించిన తారలు ఉన్నారు. వీరిలో సునీల్‌దత్‌ అత్యంత సమర్థుడిగా గుర్తింపు పొందారు.
బాబుల్‌ సుప్రియో (పట్టణాభివృద్ధి శాఖ)
వినోద్‌ ఖన్నా (పర్యాటక సాంస్కృతిక శాఖ)
సునీల్‌ దత్‌ (యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి)
నెపోలియన్‌ (సామాజిక న్యాయం సాధికారత)
శత్రుఘ్నసిన్హా (ఆరోగ్య శాఖ, షిప్పింగ్‌ శాఖ)
అంబరీష్‌    (సమాచార, ప్రసార శాఖ)
స్మృతి ఇరానీ (మానవ వనరుల అభివృద్ధి, సమాచార ప్రసార శాఖ)

తారల  ముచ్చట్లు
ఆంధ్రా అంటేనే ఒక టాకీస్‌. ఈ రాష్ట్ర ప్రజలు సినిమా తారల్ని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఈ రాష్ట్రమే అత్యధికంగా తొమ్మిది మంది తారల్ని లోక్‌సభకు పంపి రికార్డు సృష్టించింది. అంతేకాదు తొలి లోక్‌సభలో కూడా హరీంద్ర చటోపాధ్యాయ అనే నటుడు విజయవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే గెలిచారు.
నటుడు కొంగర జగ్గయ్య లోక్‌సభలో అడుగుపెట్టిన తొలి తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. 1967లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు నుంచి పోటీచేసి 80 వేల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో అడుగుపెట్టిన వారిలో మచిలీపట్నం నుంచి సత్యనారాయణ, కాకినాడ నుంచి కృష్ణంరాజు, మెదక్‌ నుంచి విజయశాంతి వంటి ప్రముఖనటీనటులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌ ఏడుగురు సినీ తారల్ని గెలిపించి రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వారిలో ఒకరు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి లక్షా 87 వేల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు.ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకుదూరమయ్యారు.
జయప్రద, హేమమాలిని, రాజ్‌బబ్బర్‌ కూడా యూపీ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. రామ్‌పూర్, మధుర, ఆగ్రా స్థానాలకు వీరు ప్రాతినిధ్యం వహించారు.
లోక్‌సభలో అడుగుపెట్టిన నటీనటుల్లో ప్రాంతీయ సినీ పరిశ్రమల నుంచి గెలుపొందిన వారు 60 శాతమైతే, బాలీవుడ్‌ తారలు 40 శాతం గెలుపొందారు.
అమితాబ్‌ బచ్చన్‌ అత్యధికంగా 42.2 శాతం ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధిస్తే, నటుడు గోవిందా అత్యంత తక్కువగా 4.3 శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు.
దివంగత సినీ నటుడుసునీల్‌దత్‌ అత్యధికంగాఅయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డుసృష్టించారు.

తారా బలం
లోక్‌సభ ఎన్నికల్లో అందరి కంటే ఎక్కుమంది తారల్ని నిలిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ పడిన తారలు
18 బీజేపీ తరఫున అందరి కంటే ఎక్కువగా పోటీలో ఉన్న తారల సంఖ్య
23 బాలీవుడ్‌ పరిశ్రమ నుంచి వచ్చిన తారలు
35 వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమల నుంచి వచ్చిన నటీనటులు
39 ఎన్నికల ‘తెర’పై విజేతలైన నటుల సంఖ్య
19  ఎన్నికల క్షేత్రంలో ఓటమి పాలైన తారలు
22 - 2014లో రికార్డు స్థాయిలో బరిలో దిగిన నటుల సంఖ్య

ఇప్పటి వరకు ఏయే పార్టీలు ఎందరికి ఇచ్చాయంటే..
18  బీజేపీ
17  కాంగ్రెస్‌
6    టీడీపీ
5   తృణమూల్‌ కాంగ్రెస్‌
02 ఆప్‌
10 ఇతరులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement