ప్రజా నాయకుడు | Leader Baga Reddy Political Story | Sakshi
Sakshi News home page

ప్రజా నాయకుడు

Published Thu, Mar 28 2019 12:12 PM | Last Updated on Thu, Mar 28 2019 12:12 PM

Leader Baga Reddy Political Story - Sakshi

లెజెండ్‌ బాగారెడ్డి

నాయకుడు ప్రజల్లో నుంచి రావాలి.. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రావాలి.. ప్రజలు కావాలని కోరుకుంటే రావాలి.. అప్పుడే ఆ నాయకుడు సంపూర్ణ పాలకుడు అవుతాడు అనడానికి మొగలిగుండ్ల బాగారెడ్డి నిదర్శనం. గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా దాదాపు ఐదున్నర  దశాబ్దాలు ప్రజా క్షేత్రంలో గడిపిన జీవితం ఆయనది. రాష్ట్రంలో, కేంద్రంలో వివిధ పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చారాయన. ఇందిరాగాంధీ ముఖ్య అనుచరుడుగా ముద్రపడిన ఈయన జీవితకాలంలో సర్పంచ్‌ నుంచి లోక్‌సభ సభ్యుని వరకు వివిధ స్థాయిల్లో పోటీచేసిన ప్రతిసారీ ప్రజల మద్దతు చూరగొని హేమాహేమీలను ఓడించి వివిధ పదవులను అలంకరించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన ఇక ఎన్నికల్లో పోటీకి దిగలేదు.- ఈరగాని భిక్షం, సాక్షి– సిద్దిపేట

 ప్రజా నాయకుడుగా పేరున్న బాగారెడ్డి ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం మలిచల్మ గ్రామంలో 1930, జూన్‌ 17న      వ్యవసాయ కుటుంబంలో బాగారెడ్డి జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసమంతా జహీరాబాద్‌లోనే కొనసాగించారు.  సెకండరీ ఎడ్యుకేషన్‌ను జహీరాబాద్‌కు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొంది, తిరిగి స్వగ్రామానికి వచ్చారు. గ్రామ ప్రజలతో మమేకం కావడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో ఆయన నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే తొలిసారిగా మలిచల్మ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా గ్రామ సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన బాగారెడ్డి ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదిగారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఐదు దశాబ్దాలకు పైగా ప్రతినిధిగా..
నూనుగు మీసాల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసిన బాగారెడ్డి పాతికేళ్ల వయసులోనే గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 26 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై పిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన వారి జాబితాలో చేరారు. ఇలా ఆయన జీవించిన 74 సంవత్సరాల్లో దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు ప్రజాప్రతినిధిగానే గడిపారు. 1957 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాగారెడ్డి.. సమీప ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై 5,568 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత 1962, 1967, 1972, 1978, 1983, 1985 శాసనసభ ఎన్నికల్లో వరుసగా జహీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయాలను నమోదు చేశారు. అనంతరం 1989లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి మాణిక్‌రెడ్డిపై 96,096 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం 1991, 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించారు. చివరికి 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిపోయారు. ఈయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ మంత్రిత్వ శాఖలకు సారథ్యం వహించారు. నాటి కాంగ్రెస్‌ రాజకీయాలలో ఇందిరాగాంధీ ప్రధాన అనుచర వర్గంలో ఒకరిగా వ్యవహరించే వారు. క్లిష్ట పరిస్థితుల్లో 1980లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీని పోటీకి దింపి, ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు బాగారెడ్డి చేసిన కృషికి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందాయి. చివరి ఎన్నికలో పోటీ తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2004లో గుండెపోటుకు గురై మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement