సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మిత్రుల తోడ్పాటుతో ముందుకెళతామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి తాను రేసులో లేనని స్పష్టం చేశారు. బీజేపీలో వ్యక్తుల ప్రాబల్యం ఉండదని చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో అధిక సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలకు వెళ్లామని చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని చెప్పారు. గడ్కరీ శుక్రవారం ఓ వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమకు శత్రువు కాదని, ఇరు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని అన్నారు. వ్యవసాయం, ఉపాధి రంగాలను గాడినపెట్టేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తమ నిర్ణయాలు ఫలితాలు ఇచ్చేందుకు కొంత సమయం అవసరమని అన్నారు. ప్రధానిని దొంగ అనడం సరికాదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి గడ్కరీ చురకలు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment