భక్తుల పాదరక్షలు తుడుస్తున్న నర్మద
టీ.నగర్: శ్రీరంగం ఆలయంలో భక్తుల పాదరక్షలు తుడుస్తూ వినూత్న ప్రచారం చేపట్టిన మహిళను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి శ్రీరంగం ఆలయానికి గురువారం భక్తులు వస్తుండగా అక్కడ వీధిలో కూర్చున్న ఒక మహిళ వస్తున్న భక్తుల పాదరక్షలను తుడుస్తూ వచ్చింది. ఆ సమయంలో ఆమె తిరుచ్చి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయవద్దని అభ్యర్థిస్తూ ప్రచారం సాగించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలు అక్కడికి వచ్చి మహిళతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న శ్రీరంగం పోలీసులు మహిళను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
సదరు మహిళ చెన్నై అన్నానగర్‌కు చెందిన నర్మద నందకుమార్‌గా తెలిసింది. ఇలావుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శరణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్మదపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. తర్వాత ఆమెను తిరుచ్చి మహిళా జైలులో నిర్బంధించారు. ముందుగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమికి ప్రచారం చేస్తున్న వీరమణి కృష్ణ భగవానున్ని కించపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నారని, దైవదూషణ కారణంగా ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో తిరుచ్చి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తిరునావుక్కరసర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ భక్తుల పాదరక్షలు తుడుస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment