ప్రపంచకప్ దాకా ధోని ఉండాలి
సెహ్వాగ్ అభిప్రాయం
న్యూఢిల్లీ: వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు ధోనిని కెప్టెన్‌గా కొనసాగించాలని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మహీ జట్టులో ఉంటే జనాలకు కూడా కాస్త భరోసా ఉంటుందన్నాడు. ‘ధోని జట్టులో లేకపోతే 5,6,7 స్థానాలు ఖాళీగా కనబడతాయి. అలాగే వేరే వాళ్లు మ్యాచ్‌ను ఫినిష్ చేస్తారని నమ్మలేం. అదే అతను ఉంటే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడంతో పాటు అద్భుతమైన ముగింపునిస్తాడు’ అని వీరూ పేర్కొన్నాడు. టీమిండియా నుంచి తనను తీసేయడానికి ప్రధాన కారణం ధోనియే అన్న విమర్శను సెహ్వాగ్ తోసిపుచ్చాడు.
మహీ చాలా మంచి వ్యక్తి అని సీనియర్లను బాగా గౌరవిస్తాడని చెప్పాడు. కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన తర్వాత చాలా మంది సీనియర్లతో కలిసి ఆడటమే ఇందుకు నిదర్శనమన్నాడు. ‘కెప్టెన్సీ విషయంలో ధోనితో నాకెప్పుడూ విభేదాలు రాలేదు. మా గురించి మీడియాలో వచ్చిన అనేక వార్తలు నిజం కాదు. నన్ను చాలాసార్లు జట్టు నుంచి తొలగించారు. ఫామ్‌లో లేకపోతే ఎవరైనా తీసేస్తారు. ఆటగాళ్లను ఉంచడం, తీసేయడం వంటి పద్ధతులు గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగాయి. కానీ ఆ తర్వాతి కాలంలో సెలక్టర్లే నిర్ణయం తీసుకునేవారు’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నాడు. విజయంలో ధోనితో పాటు జట్టుకూ కూడా కాస్త ఘనత ఇవ్వాలని చెప్పినట్లు గుర్తు చేశాడు. ఏదేమైనా ఇప్పటికైతే భారత్ బెస్ట్ కెప్టెన్ ధోనియేనని ప్రశంసలు కురిపించాడు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడటానికి కారణం బ్యాటింగ్, బౌలింగ్ అనుకున్న స్థాయిలో లేకపోవడమేనని వీరూ వ్యాఖ్యానించాడు.