జయం మనదే... | Indian women beat Poland to win Hockey World League Round 2 | Sakshi
Sakshi News home page

జయం మనదే...

Published Mon, Mar 16 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

జయం మనదే...

జయం మనదే...

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. వరల్డ్ హాకీ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 3-1 గోల్స్ తేడాతో పోలండ్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున వందన కటారియా (15వ ని.లో), రాణి రాంపాల్ (44వ ని.లో), కెప్టెన్ రీతూ రాణి (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పోలండ్‌కు ఒరియానా వాలాసెక్ (17వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది.

ఈ టోర్నీ మొత్తంలో భారత్ 39 గోల్స్ చేసి కేవలం ఒక్క గోల్ మాత్రమే ప్రత్యర్థి జట్టుకు ఇచ్చింది. ఈ గెలుపుతో భారత జట్టు జూన్‌లో స్పెయిన్‌లో జరిగే వరల్డ్ హాకీ లీగ్ సెమీఫెనల్స్ దశకు అర్హత సాధించింది. రెండు దశల్లో జరిగే వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ ద్వారా ఏడు జట్లు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. భారత కెప్టెన్ రీతూ రాణి ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.
 
లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లతోపాటు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లో ఏకపక్ష విజయాలు సాధించిన భారత్ టైటిల్ పోరులోనూ ఆధిపత్యం చలాయించింది. వందన చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ రెండు నిమిషాల తేడాలో గోల్‌ను సమర్పించుకుంది. ఆ తర్వాత పక్కా ప్రణాళికతో ఆడిన టీమిండియా పోలండ్ దూకుడుకు పగ్గాలు వేసింది. 44వ నిమిషంలో రాణి రాంపాల్ గోల్‌తో 2-1తో ముందంజ వేసిన భారత్ మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా మూడో గోల్‌ను చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement