
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో కరీంనగర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 44– 26తో పాలమూరు పాంథర్స్ జట్టుపై ఘనవిజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న కరీంనగర్ కింగ్స్... పాంథర్స్‌పై ఎదురులేని విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన పాలమూరు పాంథర్స్ ఆతర్వాత తడబడింది.
కింగ్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ తొలి అర్ధభాగాన్ని 22–13తో ముగించారు. రెండో అర్ధభాగంలోనూ పాంథర్స్ తేలిపోవడంతో కరీంనగర్ జట్టును విజయం వరించింది. విజేత జట్టులో మునీశ్ ‘బెస్ట్ రైడర్’, కె. శ్రీనివాస్ ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను అందుకున్నారు. మరో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 40–21 నల్లగొండ ఈగల్స్‌పై విజయం సాధించింది. నేడు జరుగనున్న మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బుల్స్‌తో గద్వాల్ గ్లాడియేటర్స్, రంగారెడ్డి రైడర్స్‌తో మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment