సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ టోర్నమెంట్‌లో నల్లగొండ ఈగల్స్ జట్టు విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 43–36తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నల్లగొండ ఈగల్స్ జట్టు తొలి అర్ధభాగం ముగిసేసరికి 23–16తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో ఈగల్స్ జట్టుకు దీటుగా గద్వాల్ గ్లాడియేటర్స్ జట్టు పోరాడింది. దీంతో రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ చెరో 20 పాయింట్లు సాధించాయి. అయితే తొలి అర్ధభాగంలో సాధించిన ఆధిక్యం కారణంగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. 19 పాయింట్లతో ఈగల్స్ జట్టుకు విజయాన్నందించిన పి. మల్లికార్జున్‌కు ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... డిఫెండింగ్‌లో రాణి ంచిన రామ్ ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
సైబరాబాద్ చార్జర్స్, వరంగల్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు ప్రతీ దశలోనూ సమఉజ్జీగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో 15–15, రెండో అర్ధభాగంలో 24–24తో సమంగా నిలిచిన ఈ జట్లు చివరకు 39–39తో మ్యాచ్‌ను ముగించాయి. సైబరాబాద్ తరఫున శ్రీ కృష్ణ... వరంగల్ జట్టులో రాజు మెరుగ్గా ఆడారు. రాజు (వరంగల్ వారియర్స్) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా... శ్రీకృష్ణ (సైబరాబాద్ చార్జర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గద్వాల్ గ్లాడియేటర్స్‌తో హైదరాబాద్ బుల్స్, నల్లగొండ ఈగల్స్‌తో మంచిర్యాల్ టైగర్స్, వరంగల్ వారియర్స్‌తో కరీంనగర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లన్నీ ఫేస్‌బుక్, స్టార్ స్పోర్ట్స్–1 (తెలుగు) చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment