91 మందికి కెంపేగౌడ అవార్డులు | 91 people kempegauda Awards | Sakshi
Sakshi News home page

91 మందికి కెంపేగౌడ అవార్డులు

Published Sat, Apr 4 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

91 people kempegauda Awards

నేడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా ప్రదానం
వివరాలు వెల్లడించిన బీబీఎంపీ మేయర్ శాంతకుమారి

 
బెంగళూరు(బనశంకరి): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 91 మందిని కెంపేగౌడ పురస్కారంతో శనివారం సత్కరించనున్నట్లు బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) మేయర్ శాంతకుమారి తెలిపారు. బీబీఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నాడ ప్రభు కెంపేగౌడ వర్ధంతిని పురస్కరించుకుని తొలుత ఈ ఏడాది 50 మందికి పురస్కారాలు ఇవ్వాలని భావించామని, అయితే 300కు పైగా దరఖాస్తులు రావడంతో ఆ సంఖ్య 91కి చేరిందని తెలిపారు. అవార్డు గ్రహీతల ఎంపికను పురస్కారాల సమితి పూర్తి చేసిందని తెలిపారు. బీబీఎంపీలో ఉత్తమ సేవలు అందించిన 125 మంది అధికారులు, నౌకరులకు పురస్కారాలు అందజేసి సన్మానించనున్నట్లు చెప్పారు. కెంపేగౌడ వర్ధంతిని శనివారం ఉదయం 8గంటలకు పాలికె ముందు ఉన్న నాడప్రభు విగ్రహం వద్ద ప్రారంభించనున్నట్లు తెలిపారు. 9 గంటలకు లాల్‌బాగ్‌లో ఉన్న సరిహద్దు గోపుర, కోరమంగలలోని కెంపేగౌడ కోడలు లక్ష్మిదేవమ్మ సమాధికి పూజలు ఉంటాయని అన్నారు.

ఒకే సమయంలో అన్ని సరిహద్దు గోపురాలకు పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అంతేగాక కెంపేగౌడ జ్యోతి నాలుగు సరిహద్దుగోపురాల నుంచి  జానపద బృందాలతో 11 గంటలకు కెంపేగౌడ కార్యాలయానికి చేరుకుంటుదన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పాలికె ఆవరణంలోని డాక్టర్ రాజ్‌కుమార్ గ్లాస్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురస్కారాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో సమాజ రంగానికి చెందిన 11 మంది, రంగభూమి కళా సేవలో తొమ్మిది, చలన చిత్ర రంగానికి చెందిన నలుగురు, నృత్యం నాలుగు, విద్య రెండు, మీడియా ఆరు, కన్నడ భాష సేవలు రెండు, చిత్రకళ మూడు, సాంస్కృతిక సేవలో నాలుగు, న్యాయ విభాగంలో రెండు, వైద్య రంగంలో ఐదు, ఇతర రంగాలకు చెందిన ఇద్దరు ఉన్నారని తెలిపారు.  విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ కే.రంగణ్ణ, బీబీఎంపీ పాలనా విభాగం నేత ఎన్‌ఆర్.రమేశ్, మాజీ మేయర్లు ఎస్‌కే.నటరాజ్, కట్టె సత్యనారాయణ, కమిషనర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement