ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లు
* ప్రచారానికి రూ.25 కోట్లు
* అభ్యర్థుల ఖర్చులపై దృష్టి
* 19 లోపు లెక్కల సమర్పణకు ఆదేశం
* తిరుప్పర గుండ్రం స్థానం ఖాళీ
* ఈసీ రాజేష్ లఖాని
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ ప్రకటించారు. అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలకు రూ.25 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు.
ఇక ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులు తమ ఖర్చుల్ని జూన్ 19వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వంగా మళ్లీ అమ్మ జయలలిత అధికార పగ్గాలు చేపట్టారు. 234లో రెండు నియోజకవర్గాలకు మాత్రం ఎన్నికల పర్వం వాయిదాలతో సాగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే శీని వేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అయింది. దీంతో రాష్ర్టంలో ఎన్నికల కోసం మూడు నియోజకవర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయవంతానికి, ఎన్నికలకు పెట్టిన ఖర్చుల వివరాలను మీడియా దృష్టికి రాజేష్ లఖానీ సోమవారం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని వివరించారు. ఎన్నికల ఖర్చు రూ.210 కోట్లుగా ప్రకటించారు.
ఇందులో రూ.25 కోట్లను ఓటింగ్ ప్రచార, అవగాహన కార్యక్రమాలకు వెచ్చించామని వివరించారు. ఓటింగ్ శాతం తగ్గుముఖంపై పరిశీలన జరుపుతున్నామని, పోలింగ్‌బూత్‌ల వారీగా, కేంద్రాల వారీగా ఈ ప్రక్రియ సాగుతున్నదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గేందుకు గల కారణాలు, పరిస్థితులను సైతం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికల వాయిదాకు సంబంధించి ప్రభుత్వ గెజిట్‌లో స్పష్టంగా ప్రకటించి ఉన్నామని గుర్తు చేశారు.
శీని వేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అయిందని పేర్కొంటూ, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఉన్నామన్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు ఒకే సారిగా ఎన్నికలు జరిపేందుకు తగ్గ చర్యలు కేంద్ర కమిషన్ త్వరలో చేపడుతుంద ని చెప్పారు. వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో తాము ముందుకు వెళ్లామని, అయితే పరిస్థితులు అనుకూలించ లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వంద శాతం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ , నిఘా బృందాలు జరిపిన తనిఖీ ల్లో రూ.115 కోట్ల మేరకు పట్టుబడ్డాయని వివరించారు. ఇందులో లెక్కలు, ఆధారాలు చూపించడంతో రూ.47 కోట్లను వెనక్కు ఇచ్చామన్నారు. మిగిలిన సొమ్ము ట్రెజరీలో ఉన్నదని, ఈ సొమ్ము తమదేనని లెక్కలు చూపించి తీసుకె ళ్లేందుకు ఇంత వరకు ఎవ్వరూ రాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నామని పేర్కొన్నారు.
ఇందుకు తగ్గ వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఎన్నికల పర్యవేక్షకులు ఇచ్చిన వివరాలను, అభ్యర్థులు ఇచ్చే వివరాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను జూన్ 19వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులందరికీ పంపించి ఉన్నామని తెలిపారు.