వాట్సాప్.. హ్యాట్సాప్!
తొలిరోజు 600 ఫిర్యాదులు
పరిష్కారానికి చర్యలు
ఓటింగ్ అవగాహనలో లఖాని
ఈసీకి వ్యతిరేకంగా వర్తకుల నిరసన
సాక్షి, చెన్నై: వాట్సాప్ ఫిర్యాదులకు ఈసీ శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లో వందలాది ఫిర్యాదులు వచ్చి చేరాయి. వీటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఇక, ఓటింగ్ హక్కు కల్గిన విద్యార్థులకు అవగాహన తరగతులకు ఈసీ రాజేష్ లఖానీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇక, ఎన్నికల పేరిట సాగుతున్న తనిఖీలు తమకు సంకటంగా మారాయంటూ వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉన్నది. ఓ వైపు రాజకీయ పక్షాలు ఇంటర్వ్యూల పర్వాన్ని ముగించి అభ్యర్థుల ఎంపిక బిజీలో పడ్డాయి.
పొత్తు, సీట్ల పందేరాల్ని వేగవంతం చేసి, ప్రచార బాటకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక, మరో వైపు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. శిక్షణ తరగతులు, ఈవీఎంల పరిశీలన, కోడ్ కూయడంతో నిబంధనల ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నంబర్‌ను ఈసీ రాజేష్ లఖానీ ప్రకటించడంతో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన వ్యవహారాలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తొలి రోజు ఆరు వందల ఫిర్యాదులు రావడంతో, వాటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఇక, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్ల నేతృత్వంలో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయి. చెన్నై కలెక్టర్ గోవిందరాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నగరంలో గోడ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పక్షాలకు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు ఇచ్చి ఉన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రజలకు ఇబ్బంది కల్గే విధంగా, అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో కొత్త ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఈసీ రాజేష్ లఖాని శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు కల్గి ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆవడిలోని ఓ విద్యా సంస్థలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా మీడియాతో రాజేష్ లఖాని మాట్లాడుతూ, కోడ్ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొన్నారు.వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి, తక్షణం చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయని, కోడ్ ఉల్లంఘన,తనిఖీలు, భద్రతా పరంగా చర్యల్లో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. విద్యార్థులకు ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఈ సారి ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
ఈసీకి వ్యతిరేకత : నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్న విషయం తెలిసిందే.ఈ తనిఖీలు తమకు సంకటం సృష్టిస్తున్నాయని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లకు నగదు తీసుకు వెళ్ల లేని పరిస్థితి ఉందని, వసూళ్లకు వెళ్లి వచ్చే సిబ్బందిని తనిఖీల పేరిట అడ్డుకుని, నగదు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు తనిఖీల్లో మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్తక సమాఖ్య నేత విక్రమ రాజ నేతృత్వంలో వర్తకులు చెన్నై కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.