వామ్మో..వాట్సాప్!
చెన్నై, సాక్షి ప్రతినిధి: సామాజిక మాధ్యమాలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, చైతన్యం అధికారులను హడలెత్తిస్తోంది. వాట్సాప్ పేరు చెబితేనే రాష్ట్రంలోని అవినీతి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.ఒకప్పుడు కేవలం పరస్పరం మాట్లాడుకునేందుకే పరిమితమైన మొబైల్ ఫోన్ల వాడకంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఇంటర్నెట్ పరిధిలు దాటిపోయి అప్పటికప్పుడే వీడియో క్లిప్పింగులు అప్‌లోడ్ చేసే సౌకర్యం వాట్సాప్ ద్వారా అందుబాటులో వచ్చింది. మంచి వార్త, చెడు సంఘటన, అధికారుల అక్రమార్జన, లంచావతారుల వీరవిహారంతోపాటు మానవీయ కోణాల్లో స్పందన సైతం క్షణాల్లో దేశవ్యాప్తంగా ప్రజా బాహుళ్యానికి చేరిపోతోంది.
ఇటీవల కాలంలో వాట్సాప్‌లో అధికారులు, రాజకీయ ప్రముఖులపై ప్రచారంలోకి వచ్చిన ఆసక్తికరమైన కథనాలు వారందరినీ ఇరుకునపెట్టాయి. వాట్సాప్‌లోకి ఎక్కే వ్యవహారంలో పోలీస్‌శాఖ పెద్దపీట దక్కించుకుంది. మూడు నెలల క్రితం ఒకఉన్నతాధికారి మరో మహిళా పోలీస్ అధికారితో సాగించిన సరస సంభాషణలు వాట్సాప్‌ద్వారా వెలుగులోకి వచ్చా యి. గుమ్మిడిపూండి వద్ద ఒక మహిళా పోలీస్ అధికారిణి వాహనచోదకుని నుండి లంచం వసూలు చేస్తున్న వీడియో వాట్సాప్‌లో హల్‌చల్ చేసింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, మరో మహిళ పరస్పరం ముద్దులు పెట్టుకోవడం వాట్సాప్‌లో ప్రచారమయింది.
త్వరలో పోలీస్ రాసలీలలు విడుదల
ఈనెల 17వ తేదీన చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్‌కు ఒక పోస్టు వచ్చింది. అదే పోలీస్‌స్టేషన్‌కు చెందిన అధికారి ఇటీవల ఒక లాడ్జీలో మరో మహిళాపోలీస్‌తో కలిసి మద్యం సేవించిన వీడియో క్లిప్పింగులు పోస్టల్ కవర్‌లోని సీడీలో ఉన్నాయి. ఈ వీడియో క్లిప్పింగులోని దృశ్యాలను త్వరలో వాట్సాప్ ద్వారా వీక్షించవచ్చని అందులో ఒక చీటి కూడా ఉండడంతో పోలీస్ అధికారులు హడలిపోయారు. ఏక్షణాన ఎవరి సమాచారం వాట్సాప్‌లో ప్రవేశిస్తుందోనని పోలీస్ అధికారులు, రాజకీయనాయకులు హడలెత్తిపోతున్నారు.
మంచి పోలీస్
పోలీస్ అధికారులను అప్రతిష్టపాలు చేసే సన్నివేశాలే కాదు మంచితనం మానవత్వం కూడా వారిలో ఉందని వాట్సాప్ నిరూపిస్తోంది. మూగజీవుల పట్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ చూపిన మమకారం ఆయనలోని మానవత్వాన్ని వాట్సాప్ వెలుగులోకి తెచ్చింది. చెన్నై నగరంలోని అత్యంత రద్దీమయమైన ఒకరోడ్డు కూడలిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తుండగా, ఒక కుక్కపిల్ల రోడ్డు దాటేందుకు ఎంతోసేపటి నుంచి ఎదురుచూస్తోంది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ కుక్కను రోడ్డు దాటొద్దంటూ సైగచేయగానే ఆగిపోయింది. సుమారు 40 సెకండ్లపాటు పోలీస్ చేతినే గమనిస్తూ నిరీక్షించింది. ఆ తరువాత కానిస్టేబుల్ ఒక రోడ్డువైపునకు వచ్చి వాహనాలను నిలిపివేసి కుక్కకు సైగ చేయగానే క్షేమంగా రోడ్డుదాటివేసింది.