శ్మశానంలో మంత్రి నిద్ర | Cemetery Minister of sleep | Sakshi

శ్మశానంలో మంత్రి నిద్ర

Published Sun, Dec 7 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

మంత్రి సతీష్ జారకీహోళీ

మంత్రి సతీష్ జారకీహోళీ

మూఢాచారాలపై ప్రజల్లో చైతన్యాన్ని కల్పించేందుకే    
 

బెంగళూరు : సాధారణంగా ఎవరైనా సరే శ్మశాన ప్రాంతం అంటే కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక శ్మశానంలో భోజనం చేయడం, అక్కడే పడుకోవడం అంటే అమ్మో మరేమైనా ఉందా! అయితే ప్రజల్లో ఉన్న అనేక మూఢనమ్మకాలపై చైతన్యాన్ని కల్పించేందుకు రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు శ్మశానంలో ఉండేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ మంత్రి మరెవరో కాదు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకీహోళి. అవును ప్రజల్లో గూడుకట్టుకున్న అనేక అపోహలు, మూఢనమ్మకాలపై సమరం సాగించేందుకు బెళగావిలోని ఓ స్మశానవాటికలో శనివారం ‘స్మశాన నిద్ర’ అనే కార్యక్రమాన్ని సతీష్ జారకీహోళి నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు పదివేల మందికి శ్మశానంలోనే భోజన వసతిని ఏర్పాటు చేశారు. శ్మశానమంతటా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రాత్రి పది గంటల వరకు శ్మశానంలో అందరూ ఉండే విధంగా వసతులను సమకూర్చారు.

ఈ సందర్భంగా సతీష్ జారకీహోళి మాట్లాడుతూ...‘ఏ అంశమైనా మన ఆలోచనా విధానాన్ని బట్టి మంచి లేదా చెడు అనే రూపాన్ని సంతరించుకుంటుంది. అంతే తప్ప ఓ ప్రాంతం మంచిదనో, చెడుదనో లేక ఓ సమయం మంచిదనో చెడుదనో భావించడం సరికాదు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’ అని చెప్పారు. ఇక సతీష్ జారకీహోళీ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు స్వామీజీలు సైతం పాల్గొని తమ మద్దతును తెలపడం గమనార్హం.
 
 

Advertisement

పోల్

Advertisement