ఘనంగా గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానం | Gollapudi award presented to Lens creator Jayaprakash Radhakrishnan | Sakshi
Sakshi News home page

ఘనంగా గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానం

Published Sun, Aug 14 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ఘనంగా గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానం

ఘనంగా గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానం

చెన్నై : గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు పురస్కార కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి స్థానిక రాయపేటలోని మ్యూజిక్ అకాడమీ ఆవరణ వేదికగా మారింది. గత 18 సంవత్సరాలుగా భాషా భేదం లేకుండా భారతీయ సినిమాకు చెందిన ఉత్తమ నూతన దర్శకుడిని ఎంపిక చేసి గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది.

ఈ సారి లెన్స్ అనే ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. గురువారం నిర్వహించిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దర్శకుడు ప్రియదర్శన్, సుధీర్ మిశ్రా, నటి జయసుధ అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ విచ్చేశారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత లెన్స్ ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్ ను ఘనంగా సత్కరించారు. దర్శకుడు ప్రియదర్శన్ జయప్రకాశ్ రాధాకృష్ణన్ ను శాలువాతో సత్కరించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ హిరాని గజమాలతో గౌరవించారు. నటి జయసుధను నగదు బహుమతి రూ.లక్షన్నర చెక్కును అందించారు. నటుడు శివరాజ్‌కుమార్ జ్ఞాపికను అందించారు.   

అనంతరం ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ది మేకింగ్ ఆఫ్ యాన్ యాక్టర్ అంశంపై ఉపన్యాసం చేశారు. ఆయన తన నట జీవితాన్ని వినోదంగా, హృదయాలను ద్రవింపజేస్తూ వెల్లడించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి ప్రోత్సాహంతో తాను నటుడిగా అంచెలంచెలుగా ఎలా ఎదిగింది వివరించారు. జీవితంలో స్ట్రగుల్స్, కరెప్షన్ అంశాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. తాను చిన్న చిన్న వేషాలు వేస్తూ ఎదిగానన్నారు. తాను హిందీలో నటించిన తొలి చిత్రం మున్నాబాయ్ ఎంబీబీఎస్ అని తెలిపారు. ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
 
అర్థం ఉన్న అవార్డు: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా మాట్లాడుతూ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు అర్థం ఉన్న అవార్డుగా పేర్కొన్నారు. ఇది మంచి చేయాలనే తపననూ,ప్రతిభను చాటు కోవాలనే కసిని పెంచే అవార్డు అని అన్నారు. అందరూ విజయాలను సాధించాలనే ప్రయత్నిస్తారని, అయితే కొందరు మాత్రమే అందులో సఫలం అవుతారని వ్యాఖ్యానించారు. అందుకు కథ చాలా ముఖ్య భాగం వహిస్తుందన్నారు. అలాంటి కథ, కథనాలతో లెన్స్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్ ను అభినందిస్తున్నానని అన్నారు. ఇలాంటి ప్రోత్సాకరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసనీయులన్నారు.

నటి జయసుధ మాట్లాడుతూ గొల్లపూడి శ్రీనివాస్ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. తనలో మంచి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. ఇక గొల్లపూడి మారుతీరావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిపారు. లెన్స్ వంటి మంచి చిత్రాన్ని రూపొందించిన జయప్రకాశ్ నారాయణన్ విజయ పయనం కొనసాగాలని ఆశిస్తున్నాని అన్నారు.
 
గర్వపడుతున్నా: ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ తాను పుట్టింది, చదుకున్నది చెన్నైలోనేనని తెలిపారు.ఇది చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు.తన తండ్రి రాజ్‌కుమార్ ఖ్యాతి గురించి అందరికీ తెలుసన్నారు. ఆయన గౌరవాన్ని తాను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తను తొలి చిత్రం ఆనంద్ చిత్రానికి తొలి అవార్డును ఈ వేదిక మీదే అందుకున్నానని, అలాంటిది సుమారు 30 ఏళ్ల తరువాత ఈ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన గొల్లపూడి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
 
ప్రతి చిత్రానికి ఎంతో నేర్చుకుంటున్నా:
ఈ అవార్డుల ఎంపిక జ్యూరీ సభ్యులైన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను తొలి నుంచి ఆ అవార్డుల కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నానని అవార్డుకు ఎంట్రీకి వచ్చిన ప్రతి చిత్రం చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఈ తరం దర్శకుల ప్రతిభ అమోఘం అని పేర్కొన్నారు.
 
ఈ అవార్డును ఊహించలేదు: అవార్డు గ్రహీత జయప్రకాశ్ రాధాకృష్ణన్ తన ఆనందాన్ని పంచుకుంటూ ఇది ఊహించని అవార్డు అన్నారు. తన తల్లిదండ్రుల పోత్సాహంతోనే తానీ వేదికపై నిలబడే స్థాయికి చేరుకున్నానని అన్నారు. గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు తనకు ఫోన్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనతోనే ఉన్నారన్నారు. అప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని ఉద్వఘ్నభరితులయ్యారు. 

ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని తెలిపే అవార్డుగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నటి సుహాసిని దర్శకత్వంలో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్, ఆయన కూతురు మధువంతి నటించిన అయామ్ యాన్ యాక్టర్ యువర్ హానర్ ఆంగ్ల నాటిక ఆహూతుల్ని అలరించింది. ఈ కార్యక్రమానికి కల్కీకొక్లిన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement