పుణే సిటీ, న్యూస్‌లైన్: పుణే పట్టణ ప్రజలు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి వీధిలో అబ్బుర పరిచే రీతిలో ఉట్టి ఉత్సవాలు నిర్వహించారు. రాత్రి వరకు ఉట్టి వేడుకలు ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా కల్యాణినగర్‌లోని రాజ్ యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టిన వారికి ఏకంగా రూ.31 లక్షల పారితోషికం అందజేశారు. ఇలా చాలాచోట్ల వివిధ మండళ్లు ఉట్టి కొట్టిన గోవిందా బృందాలకు భారీ పారితోషికాన్ని అందజేశాయి. మానవ పిరమిడ్లుగా ఏర్పడిన సన్నివేశాలను తిలకించేందుకు పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు చేరుకున్నారు.
ఉట్టి కొట్టే గ్రూపులు భారామతి, షోలాపూర్, సతారా తదితర ప్రాంతాల నుంచి కూడా పట్టణానికి వచ్చాయి. పురుషులతో పాటు మహిళా గోవిందా బృందాలు కూడా ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డాయి. ఘోర్పడి పరిసర ప్రాంతాల్లోని బి.టి.కవాడే రోడ్‌లో జరిగిన అఖిల ఘోర్పడి దహి హండి ఉత్సవాల్లో భారామతి నుంచి వచ్చిన జయ్ భవాని మండలి ఉట్టి కొట్టి రూ.2,22,202 పారితోషికం గెలుచుకుంది. పోలీసులు రాత్రి 10 గంటలలోపు ఉత్సవాలను ముగించాలని నిర్వాహకులకు సూచించడంతో వేడుకలు తొందరగా ముగించడం కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్ణీత ఎత్తులో ఉన్న ఉట్లను కొద్దిగా కిందకు దించారు.
వర్లి బీడీడీ చాల్స్‌లో ...
సాక్షి ముంబై: వర్లిలోని బీడీడీ చాల్స్‌లో బుధవారం అర్ధరాత్రి ‘శ్రీరామ్ బాల సంఘం పద్మశాలి కొండాపురం’ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగువారితో పాటు ఇతరులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘ సభ్యులు భక్తులకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారని సంఘం అధ్యక్షుడు ఎట్టె మురళి తెలిపారు.
భివండీలో ఘనంగా కృష్ణాష్టమి..
భివండీ, న్యూస్‌లైన్: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను భివండీవాసులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా పద్మనగర్ ప్రాంతంలోని బాలాజీ మందిరం, గీతా మందిరం, దత్త మందిరం, చందన్ భాగ్ లోని గీతాశ్రమం, గోపాల్ కృష్ణ మందిరం, రాణిసతి మందిర్, బజార్‌పేట్‌లోని మారుతీ మందిరం, వాణిఅలీలోని విఠల్ మందిరం తదితర మందిరాల్లో అతి వైభవంగా వేడుకలు నిర్వహించారు. గురువారం ఉదయం ధామన్‌కర్ నాక మిత్ర మండలికి చెందిన గోవిందా బృందం ఉట్టి పోటీల్లో గెలిచి పట్టణ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఈ బృందంలో 90 శాతం మంది తెలుగు వారు ఉన్నారని మండలి అధ్యక్షుడు సంతోష్ శెట్టి తెలిపారు.
ఎనిమిది అంతస్తుల మానవ పిరమిడ్ కట్టిన శేలార్ గ్రామంలోని జై హనుమాన్ మిత్ర మండలి ప్రథమ స్థానం దక్కించుకుంది. అదేవిధంగా కామత్‌ఘర్‌లోని పేనాగావ్‌లో ఉన్న బాబా ఇంగ్లిష్ మీడియం స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో ఉట్టి ఉత్సవాలు నిర్వహించింది. చిన్నారులకు ఆట-పాటలతో పాటు రాధా-కృష్ణుల వేషధారణల మధ్య ఉట్టి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు కుర్చీ పోటీలు నిర్వహించారు.
ఘనంగా ఉట్టి ఉత్సవం
Published Sat, Aug 31 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement