కృష్ణం వందే జగద్గురుమ్‌ | Sri Krishnashtami Special Food | Sakshi
Sakshi News home page

కృష్ణం వందే జగద్గురుమ్‌

Published Sat, Aug 24 2019 7:35 AM | Last Updated on Sat, Aug 24 2019 7:35 AM

Sri Krishnashtami Special Food - Sakshi

శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్తకొత్త నైవేద్యాలను చూశాడు... అబ్బో! భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోయాడు... తన గురువైన సాందీపుల వారిని పూజించాలనుకున్నాడు...
ఆయనను స్వయంగా అర్చించి, నేటి వంటలను రుచి చూపాడు... కృష్ణా! వెన్నలు, మీగడలు, పాలు, పెరుగు తిని విసిగిపోయావా అన్నాడు... లేదు గురువర్యా! మీకు వెరైటీ రుచులను గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాను... అన్నాడు. గురువులు ఆస్వాదించారు... శిష్యుడు సంబరపడ్డాడు... మరి మీరూ ఆస్వాదించండి... జగద్గురువు తన గురువును ఆదరించినట్లేమీరూ మీ గురువును ఆరాధించండి...
కృష్ణం వందే జగద్గురుమ్‌ అనండి...

రబ్రీ రసమలై
కావలసినవి: చిక్కటి పాలు – 4 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; పంచదార – పావు కప్పు; డ్రై ఫ్రూట్స్‌ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; రసమలై మిల్క్‌ పౌడర్‌ కోసం; పాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; పాలు – పావు కప్పు; నెయ్యి – అర టీ స్పూను.
తయారీ: ∙ముందుగా రబ్దీని తయారు చేసుకోవడం కోసం నాలుగు కప్పుల పాలను మందంగా ఉండే పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙అడుగంటకుండా ఉండటం కోసం మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙పాలు బాగా మరిగిన తరవాత, అర టీ స్పూను ఏలకుల పొడి అందులో వేసి గరిటెతో బాగా కలియబెట్టాలి ∙ఇవి మరుగుతుండగానే, ఒక చిన్న కప్పులో ఒక టీ స్పూను నీళ్లు పోసి అందులో కుంకుమపువ్వు రేకలు వేసి కరిగించి, మరుగుతున్న పాలలో పోసి కలపాలి ∙ఇప్పుడు పావు కప్పు పంచదార వేసి కలిపి, తీపి సరిపడిందో లేదో రుచి చూసి, అవసరమనుకుంటే మరికాస్త పంచదార జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయాలి ∙మీగడ ఏర్పడి, అంచులకు చేరినప్పుడల్లా, గరిటెతో మీగడ కలుపుతుండాలి ∙ఇలా పాలు బాగా దగ్గరపడి చిక్కపడేవరకు కలుపుతూనే ఉండాలి ∙ఆ తరవాత రెండు టేబుల్‌ స్పూన్ల డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు) జత చేసి మరోమారు బాగా కలిపి మరో ఐదు నిమిషాలు స్టౌ మీదే ఉంచాలి ∙పాలు బాగా చిక్కబడితే రబ్దీలు తయారైనట్లే ∙చిక్కబడ్డ పాలను పక్కన ఉంచాలి.

రసమలై తయారీ: ∙పెద్ద బాణలిలో ఒక కప్పు పాల పొడి వేసి, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార పొడి, పావు కప్పు పాలు జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, పాలను ఆపకుండా కలుపుతుండాలి ∙ఉండలు లేకుండా, పాలు బాగా చిక్కగా తయారయ్యేవరకు కలుపుతుండాలి ∙బాగా చిక్కబడ్డాక, అర టీ స్పూను నెయ్యి జత చేసి మరోమారు కలపాలి ∙బాణలి నుంచి విడివడేవరకు బాగా కలుపుతుండాలి ∙చేతికి నెయ్యి పూసుకుని, మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి ఒక పాత్రలో ఉంచాలి ∙చివరగా తయారుచేసి ఉంచుకున్న ర బ్రీనిరసమలై మీద పోసి వెంటనే రసమలై అందించాలి.

బెల్లంపాలకోవా
కావలసినవి: చిక్కటి పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – అర కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను.

తయారీ: ∙మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙ఏలకుల పొడి జత చేసి సుమారు గంటసేపు కలుపుతుండాలి ∙పాలు బాగా చిక్కగా అయ్యి, దగ్గర పడిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టాలి ∙పాలతో బెల్లం కలిసి ఉడుకుతున్నప్పుడు రంగు మారుతుంది ∙అలా రంగు మారిన అంటే సుమారు పావు గంట తరవాత పంచదార వేసి మరోమారు కలియబెట్టాలి ∙పాల పరిమాణం బాగా తగ్గటం గమనించాలి ∙నెయ్యి జత చేసి మరోమారు బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి ∙చల్లారుతుండగా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కోవా మాదిరిగా ఒత్తాలి ∙గట్టిపడ్డాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

చుర్మాలడ్డు
కావలసినవి: చపాతీలు – 3 (గట్టిగా,ఎండిపోయినవి); బెల్లం పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – టేబుల్‌ స్పూను; జీడిపప్పులు – 10; కిస్‌మిస్‌ – 10; నువ్వులు – టీ స్పూను
తయారీ: ∙చపాతీలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీళ్లు జత చేసి బెల్లం కరిగించాలి ∙నెయ్యి జత చేసి మరోమారు కలిపి దించేయాలి ∙బెల్లం పాకానికి చపాతీ పొడి జత చేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పైన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, నువ్వులు అద్ది అలంకరించి అందించాలి.

శ్రీఖండ్‌
కావలసినవి: పెరుగు – 6 కప్పులు (పుల్లగా ఉండకూడదు); కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; గోరువెచ్చటి పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – 4 కప్పులు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – పావు కప్పు; మిఠాయి రంగు – 2 చుక్కలు (పసుపు పచ్చ రంగు)

తయారీ: ∙పెద్ద పాత్రకు పల్చటి వస్త్రాన్ని వాసినలా కట్టి ముడి వేయాలి ∙అందులో పెరుగు వేసి ఆ పాత్రను ఫ్రిజ్‌లో మూడు గంటల సేపు ఉంచి, బయటకు తీయాలి ∙స్పూన్‌తో గట్టిగా అదిమి, పెరుగులో ఉన్న నీటిని పిండి తీసేయాలి ∙నీరు లేని గట్టి పెరుగును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙గోరు వెచ్చని పాలలో కుంకుమపువ్వును పది నిమిషాల పాటు ఉంచి, ఆ పాలను గట్టి పెరుగులో వేసి కలపాలి ∙ పంచదార, పిస్తా తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలియబెట్టాలి ∙మిఠాయిరంగును జత చేసి మరోమారు బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరవాత బయటకు తీసి చల్లగా అందించాలి.

బాసుంది
కావలసినవి:  తియ్యటి కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 400 గ్రా. (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); చిక్కటి పాలు – ఒకటిన్నర లీటర్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); పిస్తా పప్పులు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); బాదం పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – ఏడెనిమిది రేకలు; జాజికాయ పొడి – చిటికెడు.
తయారీ: ∙మందపాటి పాత్రలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్స్‌ వేసి స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి ∙పాలను మరీ మరిగించడకూడదు ∙పాలు కాగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి ∙లేదంటే గోధుమరంగులోకి మారే అవకాశం ఉంది ∙చిక్కబడుతుంటే బాసుంది తయారవుతున్నట్లు ∙మీగడ వచ్చినప్పుడల్లా అంచుల నుంచి మీగడను వేరు చేసి పాలలోకి రానిచ్చి కలుపుతుండాలి ∙ ఈ విధంగా మీగడ తరకలతో పాలు చిక్కబడ్డాక, జాజికాయ పొడి, తరిగి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపేయాలి ∙బాసుందిని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు ∙గ్లాసులలో అందించేముందు కొద్దిగా కుంకుమపువ్వుతో అలంకరిస్తే కనులకు విందుగా ఉంటుంది.

పనీర్‌ పాయసం
కావలసినవి: చిక్కటి పాలు – 3 కప్పులు; పనీర్‌ తురుము – అర కప్పు; పంచదార – 6 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 15 (సన్నగా తరగాలి); పిస్తా పప్పులు – 15 (సన్నగా తరగాలి); జీడి పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – కొద్దిగా; రోజ్‌ వాటర్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు.

తయారీ: ∙మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద పాలను మరిగించాలి ∙బాగా మరిగిన తరవాత పంచదార వేసి కలిపి ఐదు నిమిషాలుపాటు మరిగించాలి ∙డ్రైఫ్రూట్స్‌ తరుగులు వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙కుంకుమపువ్వు వేయడంతో అందమైన  రంగులోకి మారుతుంది ∙ఆ తరవాత పనీర్‌ తురుము వేసి కలపాలి ∙పనీర్‌ బాగా ఉడికేవరకు కలుపుతుండాలి ∙బాగా ఉడికినట్లు అనిపించాక రోజ్‌ వాటర్‌ జత చేసి మరోమారు కలపాలి ∙కుంకుమ పువ్వు వల్ల మంచి రంగు, రోజ్‌ వాటర్‌ వల్ల సువాసన వస్తుంది ∙పనీర్‌ పాయసాన్ని వేడివేడిగా కాని, చల్లగా కాని తీసుకోవచ్చు ∙పనీర్‌ పాయసాన్ని సర్వ్‌ చేసే ముందు పాత్రలో చిటికెడు కుంకుమ పువ్వు లేదా డ్రై ఫ్రూట్స్‌ తరుగు లేదా గులాబీ రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది.

సాథ్‌ పడీ పూరీ
కావలసినవి: మైదా పిండి – రెండున్నర కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
పేస్ట్‌ కోసం: బియ్యప్పిండి – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ పరాఠాల పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో అర కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ముద్దలా చేçసుకోవాలి (నీళ్లు పోయకూడదు) ∙మైదాపిండిని పద్నాలుగు సమాన భాగాలుగా చేసి ఒక్కో ఉండను చపాతీలా ఒత్తాలి ∙ముందుగా ఒక చపాతీ మీద బియ్యప్పిండి, నెయ్యి కలిపిన ముద్దను కొద్దిగా పూసి ఆ పైన మరో చపాతీ ఉంచాలి ∙ఈ విధంగా మొత్తం ఏడు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక ఏడవ చపాతీ మీద కూడా బియ్యప్పిండి ముద్ద పూసి నెమ్మదిగా ఆ ఏడు చపాతీలను రోల్‌ చేయాలి ∙చాకుతో గుండ్రంగా ముక్కలు కట్‌ చేయాలి. ఒక్కో ముక్కను జాగ్రత్తగా అప్పడాల కర్రతో ఒత్తాలి ∙ బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి.

బాదాం కుల్ఫీ
కావలసినవి: పాలు – 4 కప్పులు; ఏలకులు – 5; పంచదార – పావు కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 10; బ్రెడ్‌ – ఒక స్లైస్‌.

తయారీ: ∙ఏలకుల తొక్క తీసి పొడి చేసి వాడుకునే వరకు గాలిచొరని డబ్బాలో ఉంచాలి ∙బాదం పప్పులను చిన్నచిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాదం పప్పుల తొక్క తీయకుండా ఉంచితే, కుల్ఫీ తినేటప్పుడు రుచిగా ఉంటుంది ∙అలాగే కుల్ఫీ తయారయ్యాక చూడటానికి కూడా అందంగా ఉంటుంది ∙బ్రెడ్‌ స్లైస్‌ అంచులు వేరు చేసి, బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙ఇప్పుడు కుల్ఫీ తయారుచేయడం ప్రారంభించాలి ∙నాలుగు కప్పుల పాల నుంచి అర కప్పు పాలు వేరు చేసి పక్కన ఉంచాలి ∙మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి, మిగిలిన మూడున్నర కప్పుల పాలు అందులో పోసి సన్నని మంట మీద పాలను మరిగించాలి ∙మూడున్నర కప్పుల పాలు ఒకటిన్నర కప్పుల పరిమాణంలోకి వచ్చేవరకు మరిగించాలి ∙పాలు మరీ చిక్కబడిపోతే రెండున్నర కప్పుల పరిమాణం వచ్చినా పరవాలేదు ∙మిక్సీ జార్‌లో బ్రెడ్‌ ముక్కలు, కార్న్‌ ఫ్లోర్, అర కప్పు పాలు వేసి అన్నీ కలిసి మెత్తగా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలపాటు మిక్సీ పట్టాలి ∙పాలు బాగా చిక్కబడిన తరవాత మిక్సీ పట్టిన పాల ముద్దను వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙ లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది ∙ఈ మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙పంచదార వేయగానే పాలు పల్చబడతాయి ∙అందువల్ల పాలు మళ్లీ గట్టిపడేవరకు కలుపుతూ ఉడికించాలి ∙బాగా గట్టిపడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ తరుగు వేసి కలపాలి ∙ బాగా చల్లబడ్డాక, కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ఈ మిశ్రమం వేసి మూత పెట్టి, డీప్‌ ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు ఉంచి తీసేయాలి ∙ మౌల్డ్‌లో నుంచి కుల్ఫీని జాగ్రత్తగా బయటకు తీసి చల్లగా అందించాలి.

ధనియా పంజీరీ
కావలసినవి: ధనియాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – ఒక కప్పు; మఖనీ – ఒక కప్పు (తామర గింజలు); ఉడికించిన కొబ్బరి తరుగు – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 10; బాదం పప్పులు – 10; చిరోంజీ – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకులు – 4 (చిన్నవి).

తయారీ: ∙ముందుగా డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి ∙మఖ్‌నీలని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడిచేయాలి ∙బాగా వేడిగా అయిన తరవాత మనం తీసుకున్న నేతిలో సగ భాగాన్ని బాణలిలో వేయాలి ∙ నెయ్యి బాగా కరిగిన తరవాత మఖ్‌నీ ముక్కలను వేసి కరకరలాడే వరకు వేయించాలి ∙మంటను బాగా తగ్గించి, మఖ్‌నీలను బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి ∙వాటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి ∙ఆ తరవాత కొబ్బరి తురుము వేసి రంగుమారే వరకు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఆ తరవాత డ్రైఫ్రూట్స్‌ వేసి ఒక నిమిషం పాటు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఇప్పుడు మిగతా నెయ్యి వేసి కరిగాక ధనియాల పొడి వేసి వేయించాలి ∙ఆపకుండా కలుపుతుండాలి ∙మంచి వాసన వచ్చేవరకు వేయించాలి ∙ధనియాల పొడి బదులు ధనియాలు కూడా వాడుకోవచ్చు ∙ధనియాల పొడిని మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఇప్పుడు ఒక పెద్దపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి, కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, చిరోంజీ వేసి కలపాలి ∙ఇది పొడిగా ఉంటుంది ∙మఖ్‌నీలను చేతితో మెత్తగా నలపాలి ∙ఆ పొడిని కూడా జతచేసి మరోమారు కలపాలి ∙మఖ్‌నీ బదులు మెలన్‌ గింజలు కూడా వేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement