ఈసీఐఎల్ ఉద్యోగిగా వీఆర్‌ఎస్ తీసుకుని...
హైదరాబాద్: భారీగా ఆస్తులున్నట్టు చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాణాపురం లక్ష్మణ్‌రావు నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా రెండో రోజూ సోదాలు కొనసాగించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంట్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటలపాటు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కూడా తనిఖీలు కొనసాగాయి. లక్ష్మణ్‌రావు కుటుంబ సభ్యులను కూడా ఐటీ అధికారులు విచారించారు. ఈసీఐఎల్ ఉద్యోగిగా వీఆర్‌ఎస్ తీసుకుని 2008 నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ఉన్నట్టు లక్ష్మణ్‌రావు ప్రకటించారు. లక్ష్మణరావు వద్ద నిజంగానే రూ.9,800 కోట్ల ఆస్తులున్నాయా? ఆ మేరకు ఆస్తులు లేకున్నా ఉన్నట్లు వెల్లడించారా? లేక ఇతరులకు బీనామీగా ఈ ఆస్తులను ప్రకటించారా? అన్న అంశాలపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.