
భార్య మరణం తట్టుకోలేక..
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న వైద్య విద్యార్థిని సంధ్యారాణి భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యయత్నం చేశాడు. భార్య మరణించడంతో తీవ్ర మనస్తాపం చెందిన రవి మిర్యాలగూడలో బుధవారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. (చదవండి : వేధింపులతో చంపేస్తున్నారు..! )
రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం. దీంతో సంధ్యారాణి, రవి కుటుంబాల్లో విషాదం నెలకొంది. 10 నెలల క్రితమే వీరికి వివాహమైంది.ఉన్నత చదువులు అభ్యసించిన భార్యభర్తలిద్దరు డాక్టర్లుగా స్థిరపడుతున్న సమయంలో ప్రొఫెసర్ వేధింపులకు సంధ్యారాణి మృతి చెందడం, రవి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులకు గురిచేసిన డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.(చదవండి : పరారీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ )