
నీట్ సమరం
► కదం తొక్కిన ప్రతిపక్షాలు
► డీఎంకే నేతృత్వంలో భారీ నిరసన
► ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ
► వైద్య కౌన్సెలింగ్ ప్రారంభం
► నేటినుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ
నీట్ మినహాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో గురువారం చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఎంకేల నేతలు ఈ వేదిక మీద నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ చేశారు. ఇక, నీట్ అమల్లోకి రావడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
సాక్షి,చెన్నై : రాష్ట్రంలో నీట్ మినహాయింపు అంటూ కేంద్రంతో కలిసి పళని ప్రభుత్వం ఆడిన నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీట్ అమల్లోకి రావడంతో స్టేట్ సిలబస్ విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారిందనే ఆరోపణలు బయలుదేరాయి. తమిళ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహం, మోసాన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో చెన్నై చేపాక్కం అతిథి గృహాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత నల్లకన్ను, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే)నేత జవహరుల్లాలతో పాటుగా ప్రజా, కార్మిక, వర్తక సంఘాల నేతలు, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ, దుమ్మెత్తిపోస్తూ నినాదాల్ని హోరెత్తించారు.
కౌన్సెలింగ్‌కు శ్రీకారం
నీట్ అమలుతో గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. తొలిరోజు రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీచేశారు. శుక్రవారం నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగనుంది. నీట్ అమల్లోకి రావడంతో ఈసారి సీబీఎస్సీ విద్యార్థులకు 1,310 సీట్లను కేటాయించారు. ఇదివరకు కేవలం 30 సీట్లు కేటాయించే వాళ్లు. ప్రస్తుతం నీట్ పుణ్యమా అదనంగా 1,280 సీట్లు అప్పగించాల్సిన పరిస్థితి. ఈ సీట్లు గతంలో స్టేట్ సిలబస్ విద్యార్థులకు దక్కేవి. అయితే, ఇప్పుడు ఆ సీట్లు దూరం అయ్యాయి.
ఈ ఏడాది స్టేట్ సిలబస్ విద్యార్థులకు 2,224 సీట్లను కేటాయించారు. ఒకటో ర్యాంక్ నుంచి 402 ర్యాంక్ వరకు జనరల్ కోటా సీట్ల భర్తీ శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు జరగనుంది. ఇందు కోసం ఓమందూరు ఎస్టేట్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెలవు రోజుల్లోనూ కౌన్సెలింగ్ జరగనుంది. ఇక, బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో విద్యార్థులు నగదు రూపంలో ఫీజుల్ని చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు.
సాగనంపుదాం
ఈ నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రసంగిస్తూ, తమిళనాడుకు పెను ముప్పు ఎదురు కాబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ముప్పు నుంచి తమిళ ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు భారీఎత్తున పోరాటాల్ని సాగించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ పాలకుల అవివేకం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో విద్యార్థులకు దోహదకారిగా ఉండే విధంగా విద్యావిధానాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగామని వివరించారు.
అయితే, ఇప్పుడున్న వాళ్లు రాష్ట్రాన్నే కేంద్రానికి తాకట్టు పెట్టారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పులు చేసింది కాకుండా, నిందల్ని తమమీదకు నెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ స్వలాభం కోసం పాకులాడుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో గద్దెనెక్కాలన్న ఆశ తమకు లేదని, ప్రజా స్వామ్య పద్ధతిలోనే ప్రజలు, అన్ని వర్గాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు. యువతరం మేల్కొనాలని , ఈ ప్రభుత్వాన్ని సాగనంపే విధంగా ముందుకు అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు.