
హార్రర్ థ్రిల్లర్ కథతో స్వర్ణమహల్
తమిళసినిమా: హార్రర్ కథా చిత్రాలిప్పుడు చిత్ర పరిశ్రమకు వర ప్రసాదంగా మారాయి. ఈ తరహా చిత్రాలు చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉండడంతో మినిమం గ్యారంటీ చిత్రాలుగా మారాయి. అలాంటి పలు ఉత్కంఠభరిత సన్నివేశాలతో రూపొందిన తాజా చిత్రం స్వర్ణ మహల్. డాక్టర్ ఉమ సమర్పణలో ఏడీఎన్ మేకర్స్ పతాకంపై సాధన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ భవనంపై అంతస్తులో నివసించే ఒక యువతి అనూహ్యంగా కింద పడి మరణిస్తుందన్నారు. అయితే కొంత సేపు అయ్యాక అదే యువతి ప్రాణాలతో వస్తుందని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు.
ఇంతకీ ఆ యువతి నిజంగానే మరణించిందా? అదే జరిగితే మళ్లీ ప్రాణాలతో రావడం ఏమిటి? ఆత్మహత్యా? వంటి పలు అంతుపట్టని సంఘటనల సమాహారంగా స్వర్ణమహల్ చిత్రం ఉంటుందన్నారు. మనోజ్, అలీషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఓం సెరుద్, రామరాజ్, సుమన్‌శెట్టి, రత్నకుమారి ముఖ్యపాత్రలు పోషించారని చెప్పారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని చెన్నై, విజయవాడ ప్రాంతంలో రెండు షెడ్యూల్డ్‌లుగా 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలోని పాటలు, ఫైట్స్ లాంటివి ఉండవన్నారు. పూర్తిగా హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాత వెల్లడించారు.