మే 18న ఐసెట్–2017
⇒ ఈ నెల 21న నోటిఫికేషన్
⇒ ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
⇒ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించే ఐసెట్–2017 మే 18న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి తెలిపారు. వరంగల్‌లోని కేయూలో మంగళవారం ఆయన ఐసెట్–2017 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐసెట్–2017 నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేస్తారన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాసులు స్వీకరిస్తామని, అయితే.. దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారనే విషయాన్ని నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని, దరఖాస్తులను అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకు ఉంటుందన్నారు.
దరఖాస్తు ఫీజు రూ. 350, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంటుందన్నారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 5 వరకు రూ.10వేల అపరాధ రుసుముతో ఈ ఏడాది మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 24నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఐసెట్ –2017 పరీక్ష మే 18న నిర్వహించనున్నామన్నారు. పరీక్ష అనంతరం ప్రిలిమినరీ కీ మే 21న వెల్లడిస్తామన్నారు. కీ పై మే 27న అభ్యంతరాలను స్వీకరిస్తామని, మే 30న ఫైనల్ కీతో పాటు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
ఐసెట్‌కు 16 చోట్ల రీజినల్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ ఉన్నాయన్నారు. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ మాట్లాడుతూ ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించబోతుండటం ఇది ఆరవసారి అని అన్నారు. ఈఏడాది ఐసెట్‌కు గత ఏడాది కంటే సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.వి.రంగారావు పాల్గొన్నారు.