రాష్ట్రంలో జపాన్ పారిశ్రామిక పార్కు
• అక్కడి పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడి
• చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు జపాన్ కంపెనీల ఆసక్తి
• ఇరు దేశాల పర్యటన పూర్తి.. స్వదేశానికి బయలుదేరిన కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా తమ కోసం పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేయాలని జపాన్, కొరియా కంపెనీలకు అక్కడి పారిశ్రామికవేత్తలు సూచించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. రాష్ట్రంలోని టీ– హబ్, టాస్క్ వంటి సంస్థలతో జపాన్ కంపె నీలు పని చేయనున్నాయన్నారు. ఎలక్ట్రా నిక్స్, ఫార్మా, వైద్య పరికరాల ఉత్పత్తి, వైద్య పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపా యన్నారు.
దక్షిణ కొరియా, జపాన్ పర్యటన ముగించుకుని మంత్రి కేటీఆర్ బృందం గురువారం రాష్ట్రానికి తిరుగు పయనమైం ది. ఈ నేపథ్యంలో తన పర్యటన విశేషాలతో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆది నుంచి రుణ సాయం అందిస్తున్న జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)తో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని, రాష్ట్ర ప్రాజెక్టులకు రుణ సాయం అందించేందుకు జైకా సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు. ఈ పర్యటన ద్వారా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న రెండు దేశాలకు తెలంగాణ గురించి పరిచయం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్ ఐపాస్‌ను అక్కడి పారిశ్రామికవేత్తలు ఎంతో మెచ్చుకున్నారని, హిటాచీ, సాఫ్ట్ బ్యాంక్, తోషిబా, సుమిటొమో, ఈసాయి లాంటి కంపెనీలు రాష్ట్రంలో పర్యటించేందుకు అంగీకరించాయన్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న తమ వ్యాపారాలను విస్తరించేందుకు పలు పరిశ్రమలు ముందుకొచ్చాయన్నారు. జపనీస్ వాణిజ్య సంఘాలు జెట్రో, కెడెన్‌రన్‌తో చర్చల ద్వారా అవగాహన ఏర్పరచుకున్నా మన్నారు. రాబోయే రోజుల్లో కొరియా, జపాన్ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు హాజరు కావాలని కొరియా, జపాన్ కంపెనీలను ఆహ్వానిం చామన్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ అంగీకరించారన్నారు. జపాన్ కంపెనీల పెట్టుబడుల కోసం మరోసారి ఆ దేశంలోని టోక్యో, ఒసాకా నగరాల్లో పర్యటిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.