తెలుగు తమ్ముళ్లకు వాస్తు భయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగు తమ్ముళ్లకు వాస్తుభయం పట్టుకుంది. ఒక్కరొక్కరే సైకిల్ దిగి కారెక్కుతుండటంతో డీలాపడిన ముఖ్యనేతలు దీనికి వాస్తు దోషమే కారణమనే నిర్ణయానికొచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకులందరూ పార్టీని వీడడానికి ఆఫీసుకు వాస్తు లేకపోవడమేనని అంచనాకొచ్చారు. నాడు మహేందర్‌రెడ్డి పార్టీ వీడినా.. తాజాగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరినా.. వాస్తుదోషమేనని అనుమానిస్తున్నారు.
తాజాగా సారథ్య బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌గౌడ్ ఇదే అపనమ్మకంతో పార్టీ కార్యాలయం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. గతంలో మహేందర్‌రెడ్డి కారెక్కిన సమయంలో వాస్తుగండమేనని భావించిన మంచిరెడ్డి పార్టీ కార్యాల యాన్ని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి మార్చారు. ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన ప్రకాశ్‌గౌడ్.. ఈ ఆఫీసును మార్చేందుకు వాస్తు నిపుణులను సంప్రదిస్తున్నారు.