ఇల్లు కూలి తల్లీకూతుళ్లు మృతి | mother daughters dies in house crash | Sakshi
Sakshi News home page

ఇల్లు కూలి తల్లీకూతుళ్లు మృతి

Published Thu, Jan 29 2015 5:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

ఇల్లు కూలి తల్లీకూతుళ్లు మృతి

ఇల్లు కూలి తల్లీకూతుళ్లు మృతి

క్రితం రోజు రాత్రి వరకు తల్లిదండ్రులతో హాయిగా గడిపిన పిల్లలు తెల్లవారేసరికి విగ తజీవులుగా మిగిలారు. అందరూ కబుర్లు చెబుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. అవే చివరిమాటలు అని ఆ తల్లీపిల్లలు ఊహించలేకపోయారు. శిథిలావస్థకు చేరిన ఇంటిపైకప్పు గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో సజీవసమాధి అయ్యారు. భార్యపిల్లలను పోగొట్టుకొని ఆ ఇంటి యజమాని ఒకడే స్వల్పగాయాలతో ప్రాణాలతో మిగిలాడు.

‘దేవుడా.. నన్ను తీసుకెళ్లి నా భార్యాపిల్లలను బతికించలేకపోయావా..’ అంటూ గోవర్ధన్ చేసిన ఆర్తనాదాలతో ‘గూడెం’ భోరుమంది.

 
* తల్లీకూతుళ్లను మింగిన పెంకుటి ల్లు
* ‘గూడెం’ మేదరబస్తీలో పెను విషాదం
* శిథిలావస్థకు చేరిన పైకప్పే కారణం

కొత్తగూడెం: గాఢ నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను ఇంటి పైకప్పు పొట్టన పెట్టుకుంది. ముందురోజు రాత్రి సరదాగా గడిపి నిద్రలోకి జారుకున్న వారు ఇక శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. ఇళ్లు పైకప్పు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతిచెందడంతో కొత్తగూడెం పట్టణంలోని మేదరబస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించి..
 కొత్తగూడెం మండలం కారుకొండ గ్రామ పంచాయతీకి చెందిన చంద్రగిరి గోవర్ధన్ సుతారి మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ప్రతిరోజు కొత్తగూడెం వచ్చి పనిచేసి తిరిగి ఇంటికి వెళ్లేవాడు. ఇలా రోజు వచ్చి వెళ్లడం కష్టంగా ఉందని గోవర్ధన్ గత కొంతకాలం క్రితం పట్టణంలోని మేదరబస్తీలో ఓ పెంకుటిల్లులో కుటుంబంతో సహా అద్దెకు దిగాడు. భార్య సుధారాణి (32), కూతుళ్లు కీర్తన (11), భావన (9)తో హాయిగా గడుపుతున్నాడు. స్థానిక రవిబాల నికేతన్ పాఠశాలలో పెద్ద కూతురు కీర్తన 5వ తరగతి, చిన్నకూతురు భావన 4వ తరగతి చదువుతున్నారు. ప్రతిరోజులాగే బుధవారం సాయంత్రం స్కూల్‌కు వెళ్లి వచ్చిన పిల్లలు, పని నుంచి వచ్చిన గోవర్ధన్, తల్లి సుధారాణి కబుర్లు చెప్పుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నారు.

గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. బస్తీ మొత్తం ఉలిక్కిపడి లేచింది. ఏమైంది అని చూసే సరికి గోవర్ధన్ నివాసం ఉంటున్న పెంకుటిల్లు పైకప్పు కుప్పకూలింది. పక్క పోర్షన్‌లో నివాసం ఉంటున్న సూరిబాబు కుటుంబం ఆ శబ్దానికి బయటకు పరుగు తీసింది. గోవర్ధన్ ఇల్లు కూలిపోయి ఉంది. చుట్టుపక్కల వారు వచ్చి ఆ ఇంటి తలుపును గడ్డపారతో పగులగొట్టారు.

లోనికి వెళ్లి చూడగా పైకప్పు శిథిలాల కింద సుధారాణి, కీర్తన, భావన, గోవర్ధన్‌లు ఉన్నారు. వెంటనే స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి శిథిలాలను తొలగించి చూడగా సుధారాణి, కీర్తన, భావన అప్పటికే మృతిచెంది ఉన్నారు. ప్రాణాలతో ఉన్న గోవర్ధన్‌ను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డాడు. కళ్లముందే భార్య, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు పడి ఉండటంతో గోవర్ధన్ రోదనలు మిన్నంటాయి. ‘దేవుడా..నన్ను తీసుకెళ్లి నా భార్య పిల్లలను రక్షించలేకపోయావా..’ అంటూ గుండెపగిలేలా రోదించాడు.
 
సంఘటన స్థలాన్ని ఆర్డీవో దుగ్యాల అమయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రవి, వన్‌టౌన్ సీఐ మడత రమేష్ పరిశీలించారు. పోలీసులు స్థానికులను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సాయం ఆర్డీవో అమయ్‌కుమార్ కింద రూ.5 వేలు అందచేశారు. శిథిలావస్థకు చేరిన మరో పోర్షన్‌ను కూడా మున్సిపల్ సిబ్బంది పొక్లెయిన్‌తో తొలగించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
 
ఉలిక్కిపడ్డ మేదరబస్తీవాసులు.....
తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మేదరబస్తీవాసులంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే బయటకు వచ్చి చూడగా గోవర్ధన్ ఇల్లు కూలిపోయి కన్పించింది. శిథిలాలను తొలగించి తల్లీ కూతుళ్ల మృతదేహాలతోపాటు గోవర్ధన్‌ను బయటకు తీయగలిగారు. గోవర్ధన్ నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు పెంకులతో ఉంది. లోపల థర్మాకోల్ షీట్స్‌తో సీలింగ్ చేశారు.

దీని కారణంగా పైకప్పు ఎంతవరకు శిథిలమైందో తెలుసుకోలేకపోయారు. పైకప్పు దూలం చెదలుపట్టడం, పెంకుల సపోర్టింగ్ చెక్కలు కూడా శిథిలమైపోవడం, ఇక సపోర్టింగ్ చెక్కలు, పెంకులకు మధ్య వర్షం కురవకుండా సిమెంటుతో స్లాబ్ వేసి ఉండటం, బరువు ఎక్కువ కావడంతో కప్పు హఠాత్తుగా కుప్పుకూలింది. విరిగిన దూలం నేరుగా వచ్చి మీదపడటంతోనే తల్లీకూతుళ్లు మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో పక్కపోర్షన్‌లో ఉంటున్న సూరిబాబు కుటుంబసభ్యులు ఆందోళనకు లోనయ్యారు. గోవర్ధన్ ఇంటికప్పు కూలినప్పుడు సూరిబాబు ఉండే ఇంటిపోర్షన్ కొద్దిగా కుదిపింది. భయాందోళనకు గురైన సూరిబాబు కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు.

Advertisement
Advertisement