గ్రేటర్‌లో సర్కారీ వైన్స్! | Telangana State govt to open liquor Shops in GHMC | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో సర్కారీ వైన్స్!

Published Sat, Aug 9 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

గ్రేటర్‌లో సర్కారీ వైన్స్!

గ్రేటర్‌లో సర్కారీ వైన్స్!

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్‌డిస్పోజ్డ్ మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ప్రయోగం గత సంవత్సరం కొన్ని జిల్లాల్లో విజయవంతమైనా గ్రేటర్ పరిధిలో సాధ్యం కాలేదు. అయితే ఈసారి ప్రైవేటు వైన్‌షాపులకు దీటుగా టీఎస్‌బీసీఎల్(తెలంగాణ స్టేట్ బ్రూవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా మద్యం అమ్మకాలు సాగించేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటి వరకు 2,109 దుకాణాలను మద్యం వ్యాపారులకు కేటాయించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన షాపులన్నింటినీ పోటీపడి మరీ వ్యాపారులు దక్కించుకోగా, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 107 షాపుల నిర్వహణకు మాత్రం నాలుగుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ 107 దుకాణాల కోసం చివరిసారిగా మరో నోటిఫికేషన్ జారీ చేసి, అప్పటికీ ఎవరూ ఆసక్తి చూపకపోతే, టీఎస్‌బీసీఎల్ ద్వారా సొంతంగా వైన్‌షాపులు నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సొంతంగా మద్యం వ్యాపారం చేసిన అనుభవమున్న ఎక్సైజ్ శాఖ ఈసారి హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకొని వైన్స్ షాపులు నిర్వహించాలని భావిస్తోంది.

లెసైన్స్ ఫీజు తగ్గినా స్పందన కరువు...
గత సంవత్సరంతో పోలిస్తే గ్రేటర్‌లో ఈసారి దుకాణాల సంఖ్య పెరిగినా, 107 షాపుల విషయంలో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 53, రంగారెడ్డిలో 38, మెదక్‌లో 16 దుకాణాలున్నాయి. గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు, ఈ ఫీజు కన్నా ఏడు రెట్లు అమ్మకాలు దాటితే ప్రివిలేజ్ ఫీజు కింద 13.06 శాతం వసూలు చేయడం వంటి నిర్ణయాల కారణంగా స్పందన కొరవడిందని అధికారులు భావిస్తున్నారు.

లెసైన్స్ ఫీజు గతంలో రూ. 1.04 కోట్లు ఉండగా, దాన్ని ఇప్పుడు రూ. 90 లక్షలుగా చేశారు. దీంతో సమస్యలేదు కానీ ప్రివిలేజ్ ఫీజు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒకటి రెండు రోజుల్లో చివరి నోటిఫికేషన్ జారీ చేసి, అప్పటికీ స్పందన రాకపోతే టీఎస్‌బీసీఎల్‌తోనే వైన్స్ నిర్వహించాలని అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం.
 
టీఎస్‌బీసీఎల్‌కు షాపుల సమస్య
గత సంవత్సరం గ్రేటర్‌లో అన్‌డిస్పోజ్డ్ దుకాణాలను బ్రూవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అయితే ప్రధాన సమస్య షాపుల దగ్గరే ఏర్పడింది. మద్యం వ్యాపారులు లక్షల రూపాయల అడ్వాన్స్‌లు, భారీ మొత్తంలో అద్దె చెల్లించి, ప్రధాన రోడ్లలో షాపులు ఏర్పాటు చేస్తుండగా, టీఎస్‌బీసీఎల్ దుకాణాలకు ఎక్సైజ్ శాఖ అంత పెద్దమొత్తంలో వెచ్చించే స్థితిలో లేదు.

వీటిలో పనిచేయడానికి సిబ్బంది ఎంపికలోనూ ఇబ్బం దులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కొన్ని నిబంధనలు సడలించైనా గ్రేటర్‌లో సర్కారీ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో సర్కారీ వైన్‌షాపుల నిర్వహణ సాగిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకొని, గ్రేటర్‌లో దాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement