తెలంగాణలో మద్యం జాతర | Liquor Worth Around Rs 90Cr Sold In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మద్యం జాతర

Published Thu, May 7 2020 12:59 AM | Last Updated on Thu, May 7 2020 3:51 AM

Liquor Worth Around Rs 90Cr Sold In Telangana - Sakshi

హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ వైన్‌ షాప్‌ వద్ద మందు కొనుగోలు చేసేందుకు భౌతిక దూరం పాటిస్తూ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన 45 రోజుల తర్వాత బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది... మందుబాబులు పండుగ చేసుకున్నారు. మండే ఎండను, భారీ క్యూలను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం ఆరాటపడ్డారు. చేతిలో బాటిల్‌ పడగానే పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయి ఎంచక్కా లాగించేసి దూప తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం... ఆ జిల్లా... ఈ జిల్లా... ఆ ఊరు... ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ వైన్‌షాపు ఉన్నా ఆ షాపు ముందు భారీ క్యూలే దర్శనమిచ్చాయి. మద్యం ప్రియులు కొన్నిచోట్ల మీటర్ల దూరం బారులు తీరి భౌతిక దూరం పాటిస్తూ మరీ కొనుక్కున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.90 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోందంటే ఏ స్థాయిలో మందు బాబులు జేబులు ఖాళీ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చదవండి: వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి  

ఉదయం నుంచే బారులు...
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతపడ్డ వైన్‌షాపుల షట్టర్లు తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 8 గంటల నుంచే మందుబాబులు వైన్‌షాపుల దగ్గర చక్కర్లు ప్రారంభించారు. 9 గంటల సమయంలో ఎక్సైజ్, పోలీస్‌ సహకారంతో క్యూ కట్టడం ప్రారంభమయింది. యువకులు, మధ్య వయస్కులు, వయసు మీద పడ్డవారు, మహిళలు, యువతులు... అంతా లైన్లలోకి వచ్చేశారు. 10 గంటలు కాగానే షాపుల షట్టర్లు లేశాయి. మందుబాబులు తమకు ఇష్టమైన బ్రాండ్‌ లిక్కర్‌ను కొనుక్కుని తీసుకెళ్లారు. తొలిరోజు కావడంతో మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రజలు. మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో బుధవారమే చేతిలో ఉన్న డబ్బులకు తగినంత మందు కొనుక్కెళ్లారు. 

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో భౌతిక దూరం లేకుండా..
ధరలు పెరిగినా పట్టించుకోలేదు...
మద్యం దుకాణాలు తెరిచారన్న ఆనందంతో మందు బాబులు మద్యం ధరలు పెరిగాయన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ఇతర మద్యంపై 16 శాతం ప్రత్యేక సెస్‌ విధించడంతో బుధవారం రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం ధరలూ పెరిగాయి. ఫుల్‌బాటిల్‌ చీప్‌ లిక్కర్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.120 చొప్పున పెంచగా.. స్కాచ్, ఫారిన్‌ బ్రాండ్‌పై రూ.160, బీర్లపై రూ.30 అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. అయితే పెరిగిన మద్యం ధరలు కొంత గందరగోళానికి కారణమయ్యాయి. బుధవారం ఉదయం షాపులు తెరిచే సమయానికి బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి పెరిగిన ధరలపై స్పష్టత రాకపోవడంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో బ్రాండ్‌ను ఒక్కో రేటుకు అమ్మాల్సి వచ్చింది. చదవండి: ఆసుపత్రుల్లో ఓపీ షురూ 

మధ్యాహ్నానికి కొంత స్పష్టత వచ్చినా ధరల గందరగోళం మాత్రం సాయంత్రం వరకు సాగింది. ప్రీమియం, మీడియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.300 వరకు పెంచి అమ్మారు. ఎక్సైజ్‌ శాఖ అంచనా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.90 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి, సాధారణ రోజుల్లో రోజుకు మద్యం విక్రయాలు రూ.35 కోట్ల మేర జరుగుతాయి. అయితే, బుధవారం మద్యం ప్రియులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఈ విలువ రెండింతల కన్నా ఎక్కువ పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.50 కోట్ల వరకు విక్రయాలు జరిగి ఉంటాయని అంటున్నారు.

ఆదిలాబాద్‌ పట్టణం వినాయక్‌చౌక్‌లోని ఓ వైన్‌ షాప్‌ వద్ద.. 
డిపోలకు భారీగా ఇండెంట్లు...
ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మార్చి 22 నాటికి రూ.110 కోట్ల విలువైన మద్యం స్టాక్‌ అందుబాటులో ఉండగా, బుధవారం రూ.90 కోట్ల స్టాక్‌ అయిపోవడంతో డిపోల నుంచి సరుకు షాపులకు చేరుస్తున్నారు. వైన్స్‌ యాజమాన్యాలు కూడా తొలిరోజు నుంచే డిపోలకు భారీ ఇండెంట్లు పెట్టడంతో డిపోలకు కూడా సరుకును వేగవంతంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిపోల నుంచి షాపులకు రాత్రి 7 గంటల తర్వాత సరుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిపోల సిబ్బంది, ఎక్సైజ్‌ అధికారులు, వైన్స్‌ యజమానులకు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెరిగిన రేట్ల ప్రకారం ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు చెల్లించాల్సిన వ్యాట్‌ను నేడు కట్టించుకోనున్నారు. ఈ మేరకు గురువారం చలాన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని వైన్‌షాప్‌ యజమానులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

దూరం దూరం.. సాయంత్రానికి మాయం...
భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా తేడా వస్తే మళ్లీ మద్యం దుకాణాలు మూసేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దుకాణాలు ఎక్కడ మూసేస్తారో అనే ఆలోచనతో ఉదయం నుంచి మందుబాబులు భౌతిక దూరం నిబంధనను పాటించారు. మాస్క్‌ లేకపోతే మద్యం ఇవ్వరేమో అనే జాగ్రత్త కూడా తీసుకుని ఏదో రకమైన మాస్కు కట్టుకుని క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేస్తారన్న సమయంలో అప్పటి వరకు క్యూలో ఉన్న మందుబాబులు మందు దొరుకుతుందో.. లేదో అనే ఆదుర్దాతో భౌతిక దూరాన్ని మర్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది కూడా ఆ సమయంలో చాలా చోట్ల ఏమీ చేయలేకపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement