
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో మందు బాబులు బెంబెలేత్తారు. మద్యం దుకాణాల వద్దకు పరుగు తీశారు. పది రోజులకు సరిపడా మద్యాన్ని ఒక్కసారే కొనుగోలు చేశారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారంటే.. పరిస్థితిని ఊహించుకోవచ్చు.
ఇక నేటి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపోలలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. కేవలం నిన్న, ఈ రోజు(మే 11,12) ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం. ఇక తెలంగాణలో మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉన్నాయి.