
ఇలాగైతే విదేశాల్లో ఎగరలేం..!
ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్య
5/20 నిబంధనతో కొత్తగా వచ్చే కంపెనీలకు నష్టం
జేఆర్‌డీ ఫొటోతో పయనీర్ పేరిట 4వ విమానం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ప్రస్తుతం ఇండియా నుంచి విదేశాలకు విమానాలు నడపాలంటే.. విమానయాన రంగంలో ఐదేళ్ల అనుభవం, కనీసం 20 విమానాలున్న సంస్థలకు మాత్రమే అనుమతి ఉంది. దీన్ని 5/20 నిబంధనగా పిలుస్తున్నారు. నిజానికి ఏ దేశంలోనూ లేని నిబంధన ఇక్కడ ఒక్కచోటే ఎందుకుందో నాకు అర్థం కావటం లేదు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉంటాయి. దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఏవియేషన్ కార్యకలాపాలే అధికంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి’’ అని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ చెప్పారు.
ఎయిర్ ఏసియా ఇండియా తన 4వ విమానాన్ని శనివారమిక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, ఎయిర్ ఏసియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య, ఇండియా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ రామదొరై కూడా పాల్గొన్న ఈ సమావేశంలో టోనీ ఫెర్నాండెజ్ ప్రధానంగా 5-20 నిబంధన గురించి మాట్లాడారు. ఈ నిబంధనను అలాగే కొనసాగించాలని కొన్ని విమానయాన సంస్థలు లాబీయింగ్ చేస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా ఎయిర్ ఏసియా పోరాడుతుందని చెప్పారు. అవసరమైతే దీనికోసం ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్స్ అసోసియేషన్ ఏర్పడినా ఆశ్చర్యం లేదన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని, ఇండియాలో ఒకటిరెండు సంస్థలు నష్టాల బారిన పడినంత మాత్రాన వాటిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ఆపరేషన్లకోసం కఠినమైన నిబంధనలు పెట్టడం దారుణమని టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు. ‘‘కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తూ, భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది విమానయాన రంగం. ఈ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా వృద్ధి చెందుతుంది. దేశీ విమానయాన రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ నిబంధనలే నిరుత్సాహపరుస్తున్నాయి. దేశీయంగా కూడా చాలా విమాన కంపెనీలు విస్తరణ యోచనను విరమించుకున్నాయి’’ అని చెప్పారాయన.
‘పయనీర్’పై జేఆర్‌డీ టాటా ఫొటో
ఎయిర్ ఏషియా ఇండియా తన 4వ విమానానికి పయనీర్ అని పేరు పెట్టింది. దీనిపై దేశంలో పౌర విమానయానానికి ఆద్యుడిగా పేర్కొనే జేఆర్డీ టాటా ఫొటోను కూడా పెట్టారు. అక్టోబర్ 15, 1932న జేఆర్డీ టాటా నడిపిన పుస్‌మాత్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫొటోను దీనిపై చిత్రించారు. పయనీర్‌పై జేఆర్‌డీ ఫోటోను పెట్టింది సంస్థలో టాటా గ్రూప్‌కు 30 శాతం వాటా ఉన్నందుకు కాదని, దేశీయ విమానయానానికి రూపునిచ్చిన మహోన్నత వ్యక్తి కాబట్టేనని టోనీ వ్యాఖ్యానించారు. ఆయనే లేకపోతే దేశంలో విమానాలుండేవే కావని, ఆయన కృషికి సరైన నివాళి ఇదేననిపించి ఫొటో పెట్టామని వివరించారు.