JRD
-
ఇలాగైతే విదేశాల్లో ఎగరలేం..!
ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్య 5/20 నిబంధనతో కొత్తగా వచ్చే కంపెనీలకు నష్టం జేఆర్డీ ఫొటోతో పయనీర్ పేరిట 4వ విమానం ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ప్రస్తుతం ఇండియా నుంచి విదేశాలకు విమానాలు నడపాలంటే.. విమానయాన రంగంలో ఐదేళ్ల అనుభవం, కనీసం 20 విమానాలున్న సంస్థలకు మాత్రమే అనుమతి ఉంది. దీన్ని 5/20 నిబంధనగా పిలుస్తున్నారు. నిజానికి ఏ దేశంలోనూ లేని నిబంధన ఇక్కడ ఒక్కచోటే ఎందుకుందో నాకు అర్థం కావటం లేదు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉంటాయి. దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఏవియేషన్ కార్యకలాపాలే అధికంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి’’ అని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ చెప్పారు. ఎయిర్ ఏసియా ఇండియా తన 4వ విమానాన్ని శనివారమిక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, ఎయిర్ ఏసియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య, ఇండియా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ రామదొరై కూడా పాల్గొన్న ఈ సమావేశంలో టోనీ ఫెర్నాండెజ్ ప్రధానంగా 5-20 నిబంధన గురించి మాట్లాడారు. ఈ నిబంధనను అలాగే కొనసాగించాలని కొన్ని విమానయాన సంస్థలు లాబీయింగ్ చేస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా ఎయిర్ ఏసియా పోరాడుతుందని చెప్పారు. అవసరమైతే దీనికోసం ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్స్ అసోసియేషన్ ఏర్పడినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని, ఇండియాలో ఒకటిరెండు సంస్థలు నష్టాల బారిన పడినంత మాత్రాన వాటిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ఆపరేషన్లకోసం కఠినమైన నిబంధనలు పెట్టడం దారుణమని టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు. ‘‘కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తూ, భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది విమానయాన రంగం. ఈ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా వృద్ధి చెందుతుంది. దేశీ విమానయాన రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ నిబంధనలే నిరుత్సాహపరుస్తున్నాయి. దేశీయంగా కూడా చాలా విమాన కంపెనీలు విస్తరణ యోచనను విరమించుకున్నాయి’’ అని చెప్పారాయన. ‘పయనీర్’పై జేఆర్డీ టాటా ఫొటో ఎయిర్ ఏషియా ఇండియా తన 4వ విమానానికి పయనీర్ అని పేరు పెట్టింది. దీనిపై దేశంలో పౌర విమానయానానికి ఆద్యుడిగా పేర్కొనే జేఆర్డీ టాటా ఫొటోను కూడా పెట్టారు. అక్టోబర్ 15, 1932న జేఆర్డీ టాటా నడిపిన పుస్మాత్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫొటోను దీనిపై చిత్రించారు. పయనీర్పై జేఆర్డీ ఫోటోను పెట్టింది సంస్థలో టాటా గ్రూప్‌కు 30 శాతం వాటా ఉన్నందుకు కాదని, దేశీయ విమానయానానికి రూపునిచ్చిన మహోన్నత వ్యక్తి కాబట్టేనని టోనీ వ్యాఖ్యానించారు. ఆయనే లేకపోతే దేశంలో విమానాలుండేవే కావని, ఆయన కృషికి సరైన నివాళి ఇదేననిపించి ఫొటో పెట్టామని వివరించారు. -
పీవీ హయాంలోనే పిలిచారు
- ఎయిర్‌లైన్స్ ఏర్పాటు చేయాలని అడిగారు - జేఆర్డీ టాటా చాలా ఆనందపడ్డారు - మంచి భాగస్వామిని వెదకమని నాకు చెప్పారు - అప్పట్లో అది కుదరలేదు: రతన్‌టాటా వెల్లడి న్యూఢిల్లీ: ‘‘అవి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజులు. కేంద్ర కేబినెట్ కార్యదర్శిని జేఆర్డీ టాటా కలిశారు. ప్రైవేటు విమానయాన కంపెనీలకు అనుమతివ్వాలని పీవీ ప్రభుత్వం అనుకుంటోందనే సంగతి ఆయనకు చెప్పారు. జేఆర్డీ ఉద్వేగానికి లోనై నాతో ఈ సంగతి చెప్పారు. అయితే ఎయిర్ ఇండియాను ఆరంభించినప్పటి రోజులు కావని, విమానయాన రంగంలో తీవ్ర పోటీ ఉందని, ఏవియేషన్ కంపెనీకి మంచి భాగస్వామి కావాలని, అప్పుడే దేశానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని అందించగలమని సూచించారు. కానీ అది జరగలేదు.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు. టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారాను ఆరంభించిన సందర్భంగా బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘‘తరవాత విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలంటూ అదే ప్రభుత్వం మమ్మల్ని నేరుగా కోరింది. కానీ కుదరలేదు’’ అని తెలియజేశారు. పీవీ నరసింహారావు 1991-96 మధ్య ప్రధానిగా ఉండగా... ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందన్నది మాత్రం టాటా వెల్లడించలేదు. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్డీ టాటా ఏర్పాటు చేయగా... దాన్ని జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఆయన 1993 నవంబర్‌లో మరణించారు. అప్పటిదాకా ఉన్న లెసైన్స్-పర్మిట్-కోటా పద్ధతిని తొలగిం చి ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచిన పీవీ హయాంలోనే జెట్ ఎయిర్వేస్, దమానియా ఎయిర్వేస్ లెసైన్సులు పొందాయి. గతంలోనే మనసు విప్పిన టాటా... నిజానికి ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా కుదరలేదని గతంలో కూడా చెప్పారు. అధికారులకు లంచాలివ్వటం ఇష్టంలేకే విమానయాన సంస్థను ఏర్పాటు చేయలేదని... ఓ మంత్రికి 15 కోట్లిస్తే లెసైన్సు వస్తుందని సహ పారిశ్రామికవేత్త చెప్పినా తానా పని చేయలేదని 2010లో కూడా చెప్పారు. నిజానికి ఎయిర్ఇండియాలో 40 శాతం వాటా కొనటానికి టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి చేసిన ప్రయత్నాలు గతంలో ఫలించలేదు. రెండోసారి ఇవి రెండూ కలసి విమాన సంస్థను ఏర్పాటు చేయబోయినా కుదరలేదు. మూడో ప్రయత్నంలో ఇవి విజయవంతమై... ‘విస్తారా’ విమానం ఇటీవలే తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సేవలతోనే నిలబడాలి... ‘‘మిగతా ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే మనం ప్రత్యేకమైన సేవలందించాలి. భద్రతతో పాటు ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతినివ్వాలి. అప్పుడే ప్రయాణికులు మనని ఎంచుకుంటారు. అది చేయలేకపోతే చాలా కోల్పోతాం’’ అని టాటా చెప్పారు. ప్రత్యర్థులు ఇబ్బందులు పెడతారని కూడా ఆయన హెచ్చరించారు. అయితే సేవలు ఆరంభించడానికి తమ సంస్థ ఎంత ఓపిగ్గా వేచి చూసిందో చెబుతూ... ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు. -
‘విస్తార’ ఎగిరింది..
నెరవేరిన టాటాల ఆరు దశాబ్దాల కల ♦ ఏవియేషన్‌లోకి రీఎంట్రీ ♦ ఢిల్లీ నుంచి ముంబైకి తొలి ఫ్లయిట్ ♦ జేఆర్డీకి అంకితం ఇచ్చిన రతన్ టాటా న్యూఢిల్లీ/ముంబై: పారిశ్రామిక దిగ్గజ టాటా గ్రూప్ ఆరు దశాబ్దాల కల సాకారమైంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి గ్రూప్ ఏర్పాటు చేసిన విస్తార సంస్థ సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి ముంబైకి ఎగిరింది. దీంతో టాటాలు మళ్లీ ఏవియేషన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చినట్లయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.51కి ఎగిరిన విమానం ముంబైలో 2.46కి చేరుకుంది. ఢిల్లీలో టేకాఫ్‌కి ముందు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా శుభాకాంక్షలు తెలియజేయగా.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్వాగతం పలికారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, పలువురు ప్రముఖులు, సలాం బాలక్ ట్రస్ట్‌కి చెందిన బాలలు ఇందులో ప్రయాణించారు. ఆరు దశాబ్దాల క్రితం టాటా ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాగా రూపాంతరం చెందిన తర్వాత 1950వ దశకంలో ప్రభుత్వం దానిని జాతీయం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి, టాటాలు పలు మార్లు విమానయాన రంగంలోకి పునఃప్రవేశానికి ప్రయత్నించినా కుదరలేదు. ఇటీవలే మలేషియాకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియాతో కలసి కొత్తగా ఎయిర్ఏషియా ఇండియాను టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులో టాటా గ్రూప్‌కి 30% మైనారిటీ వాటాలు ఉన్నప్పటికీ.. రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో జోక్యం ఉండదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారను ఏర్పాటు చేసింది. ఇందులో టాటాలకు 51% మెజారిటీ వాటా ఉంది. ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ప్రైవేట్ సంస్థ జెట్ ఎయిర్వేస్ తర్వాత పూర్తి స్థాయి సర్వీసులు అందించే మూడో సంస్థ అవుతుంది విస్తార. జేఆర్డీకి అంకితం.. భారత్‌లో ప్రపంచ స్థాయిలో పూర్తి సర్వీసులతో విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలన్నది టాటా గ్రూప్ చిరకాల స్వప్నం అని రతన్ టాటా చెప్పారు. ‘ఆ కల నేడు సాకారమైంది. దీన్ని గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత జేఆర్డీ టాటాకు అంకితమిస్తున్నాను’ అని ఆయన తెలిపారు. భారీ అంచనాలతో ప్రారంభించి, ఆ తర్వాత నిరాశపర్చకుండా ఎయిర్‌లైన్స్‌ను సవ్యంగా నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని విస్తార చైర్మన్ ప్రసాద్ మీనన్ తెలిపారు. ‘పోటీ గురించి భయపడుతూ కూర్చుంటే ఏ వ్యాపారమూ ప్రారంభించలేము. అందరికీ అవకాశాలు ఉంటాయి. పోటీ అనేది అంతిమంగా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మీనన్ చెప్పారు. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు తాము అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకుఎదురుచూస్తున్నామని, అది ఇప్పటికి సాకారం అయ్యిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్(సియా) సీఈవో గో చూన్ ఫోంగ్ చెప్పారు. 2020 నాటి కి భారత్ మూడో అతి పెద్ద ఏవియషన్ మార్కెట్‌గా ఎదుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49% మేర అనుమతించ డం వల్ల మరిన్ని సంస్థలు రాగలవని ఆయన తెలిపారు. విస్తార వివరమిదీ... టాటా గ్రూప్, ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ కలసి భారత్‌లో విమానయాన సర్వీసులు ప్రారంభించేం దుకు గతంలో పలుమార్లు ప్రయత్నిం చినప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు గతేడాది ఇరు కంపెనీలు విస్తార బ్రాండ్‌నేమ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయగలిగాయి. ఫ్లయింగ్ పర్మిట్ల కోసం ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. సంవత్సరం ఆఖర్లో గానీ అనుమతులు లభించలేదు. ఎట్టకేలకు జనవరి 9 నుంచి ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు డిసెంబర్ 18న సంస్థ ప్రకటించింది. విస్తార ప్రస్తుతం రెండు ఎ320 విమానాలను లీజుకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ప్రారంభంలో ముంబై, అహ్మదాబాద్‌కు సర్వీసులు నడపనుంది. తొలి ఏడాదిలో హైదరాబాద్, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు సేవలు విస్తరిస్తుంది.