కెన్యా మృతులలో బెంగళూరు వాసి.. మృతుల్లో భారతీయులు ముగ్గురు
కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ షా షాపింగ్ మాల్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన వారిలో మరో భారతీయుడి మృతదేహన్ని భద్రత దళాలు గుర్తించాయి. బెంగళూరుకు చెందిన సుదర్శన్ బి. నాగరాజ్ కూడా ముష్కర మూకల తుపాకి గుళ్లకు బలైపోయారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
దాంతో ఆ ఘటనలో మృతి చెందిన భారతీయుల సంఖ్య మూడుకు చేరుకుందని విదేశాంగ శాఖ పేర్కొంది. శనివారం జరిగిన ఆ దాడిలో మరణించిన వారి సంఖ్య 62కు పెరిగిందని చెప్పింది. నైరోబీలోని ఫార్మసీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ నటరాజన్ మరణించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి కుమారుడు, ఎనిమిదేళ్ల బాలుడు పరాంశ్ జైన్ కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో గాయపడిన పలువురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.