కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్గేట్ షాపింగ్ మాల్లో మారణకాండ సృష్టించిన తీవ్రవాదులలో ఐదుగురిని భద్రత సిబ్బంది మట్టుబెట్టాయని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ప్రకటించారు. మరో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిన్న సాయంత్రం ఉహురు కెన్వెట్టా టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... తీవ్రవాదుల ఘాతుక చర్య తమను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. ఇలాంటి సమయంలో థైర్యంగా ఉండాలని ఆయన దేశ ప్రజలకు హితవు పలికారు.
దేశంలో జరిగిన అత్యంత విషాదరకర ఘటనల్లో ఇదో ఒకటని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు షటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకతను ఆయన విశదీకరించారు. తీవ్రవాదుల ఘాతుక చర్యలో 61 మంది పౌరులు, ఆరుగురు భద్రత దళ సిబ్బంది మరణించారని చెప్పారు. మృతుల్లో తమ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అన్నారు.
అయితే మరో 63 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని కెన్యాలోని రెడ్ క్రాస్ సంస్థ వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు ఉహురు కెన్వెట్టా వెల్లడించారు. తీవ్రవాదులు మాస్క్లు ధరించి శనివారం షాపింగ్ మాల్లోకి ప్రవేశించారు. షాపింగ్ మాల్లో ముస్లిం మతస్థులు ఎవరైన ఉంటే వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం వారు విచక్షణ రహితంగా కాల్పులకు ఉపక్రమించారు. ఆ క్రమంలో 60 మంది వరకు మరణించారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.