ఏనుగు దంతాలను తగలబెట్టేశారు
వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో భాగంగా ప్రతి ఏడాది వేలాది ఏనుగులను స్మగ్లర్లు చంపేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాలని కెన్యా నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు దేశంలో ఏనుగులను చంపి సేకరించిన... దాదాపు రూ.105 మిలియన్ డాలర్ల విలువైన ఏనుగు దంతాలను కెన్యాలోని నైరోబి జాతీయ పార్క్లో శనివారం తగలబెట్టారు. ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా వీటికి నిప్పుంటించారు. దేశంలో దాదాపు 7000 ఏనుగులకు చెందిన దంతాలను అక్రమంగా తరలిస్తుండగా... అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో దంతాల అక్రమ వ్యాపారం కోసం ఏనుగులను చంపివేస్తుండటంతో వాటి సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని కెన్యా భావించింది. అందులోభాగంగా దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏనుగు దంతాలలో ఎవరు ఎటువంటి వ్యాపారం చేయకూడదు అన్నారు. ఈ వ్యాపారం అంటేనే మరణం, ఏనుగులను చంపితే... మన జాతి సంస్కృతి మృతి చెందినట్లే అని దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఓ ఏనుగు చంపేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా అయితే రానున్న 10 ఏళ్లలో మరింత దుర్భరం అవుతుందన్నారు. 1970లో ఆఫ్రికాలో 1.2 మిలియన్ ఏనుగులు ఉండేవని.. కానీ నేటి వాటి సంఖ్య నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏనుగు దంతాలను తగలబెట్టడం ద్వారా వేటగాళ్లను కెన్యా ఓ సందేశాన్ని ఇచ్చింది.