సుప్రీంకోర్టు భవనం(ఇన్‌సెట్‌లో తాత్కాలిక అధ్యక్షుడు ఉహురు కెనట్టా)
- కెన్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నైరోబీ: దేశాధ్యక్షుడి ఎన్నికను రద్దుచేస్తూ కెన్యా సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో తీవ్ర అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన కోర్టు.. 8 రోజులలోగా తిరిగి ఎన్నికలు(రీపోలింగ్) నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఆగస్టు 12న వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉహురు కెనట్టా(జూబ్లీ పార్టీ) రెండో సారి విజయం సాధించారు. ఆయనకు 54.27 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధికారపక్షం ఈవీఎంలను ట్యాపరింగ్ చేయడంతోపాటు విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. అక్రమంగా జరిగిన ఎన్నికలను తక్షణమే రద్దుచేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన నలుగురు జడ్జిల బెంచ్ నేడు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకోగా, అధికార పార్టీ కార్యకర్తలు గుర్రుమంటున్నారు.