కెన్యా రాజధాని నైరోబిలో ఓ షాపింగ్ మాల్లో తీవ్రవాదులు నిన్న సృష్టించిన మారణహోమాన్ని ఆ దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్యెట్టా ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆ తీవ్రవాదుల దుశ్చర్య కారణంగా 39 మంది అమాయకులు దుర్మరణం పాలైయ్యారని తెలిపారు. ఆ ఘటనలో 150 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే గాయపడిన వారు దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మృతుల్లో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
అయితే ఆ తీవ్రవాదులు ఘాతుకాని కొన్ని నిముషాల ముందు వందలాది మంది ప్రజలు ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత మరణించి ఉండేవారని దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. షాపింగ్ మాల్లో భద్రత దళాలు సహాయ చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ సోమాలియాలోని తీవ్రవాద సంస్థ అల్ సబాబ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తామేనని ప్రకటించింది.
శనివారం ఆ తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఆయుధాలు ధరించి షాపింగ్ మాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఇక్కడ ముస్లింలు ఎవరైన ఉంటే వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అలా కొంత మంది బైటకు వెళ్లిన తర్వాత తీవ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే ఆ దాడిలో అమెరికా పౌరులు కూడా మరణించినట్లు నివేదికలో వెల్లడిస్తున్నాయి.