నైరోబీ: అది ఆఫ్రికన్ దేశం కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్. ఆధునికతకు.. అటవీక జీవనానికి మధ్యగా నలిగిపోయే కిటెన్‌గెలా అనే ఓ చిన్ని గ్రామం. ఆ మధ్యలో ఓ చిన్న నదీపాయ. దీంతో పక్కనే ఉన్న సఫారీ నుంచి జంతువులు తరచూ ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పచ్చిక బయళ్లకు వస్తుంటాయి. వాటిల్లో ఆవుల మందను వేటాడే సింహాలు కూడా ఉంటాయి. కానీ, అక్కడి ప్రజల విన్నూత ఆలోచనకు మృగరాజులు తోకి ముడిచి వెనక్కి చిత్తగిస్తుంటాయి. ఆ ఆలోచన వెనుక ఉన్న బుర్ర మాత్రం రిచర్డ్ టురెరె(18) కుర్ర కాపరిది. సూటిగా కథలోకి వెళ్తే...
మాసయి తెగకు చెందిన రిచర్డ్ 9 ఏళ్ల వయసులో చదువుకు పుల్‌స్టాప్ పెట్టి తండ్రికి తోడుగా పశువులను మేపటం ప్రారంభించాడు. తన కళ్ల ముందే ఆవులను సింహాలు కబళిస్తున్న ఉదంతాలు అతనిలో భయాన్ని పొగొట్టేవి. ఇదిలా ఉంటే రిచర్డ్ 11 ఏట.. తమ మందలోని 9 ఆవులను వారం రోజుల్లో సింహాల మంద పొట్టనబెట్టుకున్నాయి. ఆర్థికంగా తీరని నష్టం కలగటంతో తల్లి కుంగిపోగా.. తన బుర్రకు పదును పెట్టడం రిచర్డ్ ఆరంభించాడు. సింహాలను తరిమేందుకు భయంకరంగా ఉన్న కాకి బొమ్మను తన వెంట తీసుకెళ్లేవాడు. కానీ, ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఓ రోజు రాత్రి టార్చ్ లైట్‌తో వెళ్తున్న సమయంలో సింహాలు ఎలాంటి దాడులకు పాల్పడపోగా.. ఆ వెలుతురికి భయంతో పరుగులు తీశాయి. అంతే వెంటనే అతని మెదడులో ఓ ఆలోచన మెరిసింది.
తన తల్లి అపురూపంగా చూసుకునే రేడియోను బద్ధలు కొట్టి.. ఓ ఎల్‌ఈడీ బల్బు సాయంతో లైటింగ్ వ్యవస్థను రూపొందించాడు. సింహాలు దాడులకు వచ్చిన సమయంలో వాటిని వెలిగిలించటం.. అవి భయంతో పరుగులు తీయటం... మొత్తానికి ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అతని పరిశోధనకు పెటెంట్ హక్కులు దక్కాయి. కెన్యాలో యంగెస్ట్ పెటెంట్‌గా రిచర్డ్‌గా గుర్తింపు దక్కింది. అంతేకాదు 2013లో కాలిఫోర్నియాలో జరిగిన టెడ్ సదస్సులో ‘అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా’ లాంటి దిగ్గజాల మధ్య ప్రసంగించే అవకాశం రిచర్డ్‌కు లభించింది. దీంతోపాటే బ్రూక్ హౌస్ స్కూల్ అతనికి స్కాలర్‌షిప్ కూడా ఇచ్చింది. అయితే లయన్ లైట్స్ పెటెంట్ ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన చుట్టుపక్కల పాకటంతో మరికొందరు ఇదే పద్ధతిని అవలంభించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిచర్డ్‌ను పట్టించుకోవటం మానేశాయి. దీంతో అతని జీవితం మళ్లీ వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. పశువులను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగని ప్రయోగాలకు అతను దూరం కాలేదు. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట.
‘లయన్ లైట్స్ 2.0’ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయటానికి ఖరీదు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఓ ఎన్డీవో సంస్థ అందిస్తుండగా.. ఇంకా సగం కాపరులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 750 లయన్ లైట్ సిస్టమ్‌లు ఆ ఊరు చుట్టు పక్కల ఉన్నాయి. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాటి అవసరం ఉందని రిచర్డ్ అంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని చాలా కాలం నుంచే అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. తన కొడుకు కంటే మేధావులు ఈ దేశంలో ఎందో ఉన్నారని, ప్రభుత్వాలు సరైన తోడ్పాటు-ప్రోత్సాహం అందిస్తే వారంతా అద్భుతాలు సృష్టిస్తారని రిచర్డ్ తల్లి వెరోనికచ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment