అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన వస్తువులు
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు బాలికలు చనిపోయారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖమైన మోయి గర్ల్స్ హైస్కూల్‌లో సుమారు వెయ్యి మంది చదువుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఏడుగురు విద్యార్థినులు అక్కడికక్కడే చనిపోగా పది మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున రెండు వారాల పాటు అధికారులు సెలవులు ప్రకటించారు.
2016లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు వంద స్కూళ్లపై దాడులు జరిపారు. అలాంటి కోవలేనిదే ఈ తాజా ఘటనా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. అప్పట్లో ఇందుకు సంబంధించి 150 మంది విద్యార్థులతోపాటు 10 ఉపాధ్యాయులను నిందితులుగా గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేశ అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.