'బిన్ లాడెన్' పోలీసుపై వేటు
'అచ్చం అల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ లా ఉన్నావ్' అని తనను అవమానించిన అధికారిపై కోర్టుకు వెళ్లి, భారీ నష్టపరిహారాన్ని పొందిన వెస్ట్ మిడ్ లాండ్ పోలీసు పీ.సీ.తారీఖ్ దోస్త్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ క్రిమినల్ కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలు రుజువుకావడంతో సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు.
వెస్ట్ లాండ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న తారీఖ్.. ఒక క్రిమినల్ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులను బెదిరించారని, మరో చిన్నారిని భయభ్రాంతులకు గురిచేశారని కేసు నమోదయింది. దీనిని విచారించిన బర్మింగ్ హమ్ మెజిస్ట్రేట్ కోర్టు.. మంగళవారం తుది తీర్పును వెలువరిస్తూ తారీఖ్ ను దోషిగా నిర్ధారించింది. సెప్టెంబర్ 16న శిక్ష ఖరారుకానుంది. కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే తారీఖ్ ను డిస్మిస్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది.
తాను ఒసామాలా ఉన్నానని అధికారి అన్నట్లు ఫిర్యాదుచేసి 2009లో మొదటిసారి వార్తల్లోకి వచ్చిన తారీఖ్ అప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లోని వ్యక్తిగా ఉన్నారు. చివరికిప్పుడు బెదిరింపుల ఆరోపణల్లో ఇరుక్కుని ఉద్యోగం పోగొట్టుకున్నారు.