జపాన్ విమానం.. జారిపోయింది!!
పశ్చిమ జపాన్లో ఓ విమానం రన్వే మీద ల్యాండయిన తర్వాత జర్రున జారిపోయింది. దాంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని జపాన్ అధికార వార్తాసంస్థ ఎన్హెచ్కే తెలిపింది. ఈ కారణంగా హిరోషిమా విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి 74 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ 320 విమానం హిరోషిమా విమానాశ్రయానికి చేరుకుంది. తీరా అక్కడ రన్వే సరిగా లేకపోవడంతో జర్రున జారిపోయింది.
దాంతో ప్రయాణికులను నేరుగా దించేందుకు వీలు కుదరక.. అత్యవసర మార్గాల ద్వారా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో మాత్రం తెలియలేదు. ల్యాండింగ్ సమయంలో విమానం నేరుగా రన్వేను తాకడంతో నిప్పు రవ్వలు ఎగిశాయి. దాంతో అగ్నిమాపక దళానికి కూడా సమాచారం అందించారు. రెండేళ్ల క్రితం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఏషియానా ఎయిర్లైన్స్ విమానం ఒకటి కూలిపోయి సుమారు 200 మంది మరణించారు.