ఎస్‌ఐపై ఇసుక మాఫియా దాడి
* తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు
* ఘటనపై నాందేడ్ ఎస్పీ సీరీయస్
* డోజర్, టిప్పర్లు, ట్రాక్టర్ల సీజ్
* 17మందిపై కేసులు నమోదు
రెంజల్: ఇసుక మాఫియా బరితెగించింది. మఫ్టీలో వచ్చిన మహారాష్ట్ర పోలీసులపై దాడి చేసింది. మాఫియా దెబ్బకు ధర్మాబాద్ ఎస్సై తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు పరారయ్యారు.
ఎస్సైపై దాడి ఘటనను మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్పీ సీరీయస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి అక్రమ ఇసుక క్వారీ నుంచి డోజర్‌తోపాటు 3 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను సీజ్ చేసి ధర్మాబాద్ ఠాణాకు తరలించారు. బాధ్యులైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున తెలంగాణ-మహారాష్ట్ర మధ్యన గల గోదావరి నదిలో కందకుర్తి వద్ద వంతెన కింద 20 రోజులుగా డోజర్లు, యంత్రాలతో అక్రమంగా మాఫియా సభ్యులు ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు.
మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన వీరు యథేచ్ఛగా అక్రమ క్వారీని ఏర్పాటు చేసుకుని.. ఇసుకను నది అవతలి వైపునకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మాబాద్ ఎస్సై అమూల్ నాయక్ బుధవారం రాత్రి సిబ్బందితో మఫ్టీలో అక్రమ క్వారీ వద్దకు వచ్చారు. డోజర్లు, యంత్రాలతో గోదావరి నదిలో తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను చేరుస్తుండగా.. అక్కడకు చేరుకుని తవ్వకాలు చేపడుతున్న డోజర్ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.
అక్కడున్న ఇసుక మాఫియా సభ్యులు కందకుర్తి, ధర్మాబాద్ ప్రాంతాల్లోని మిగతా వారికి సమాచారం అందించారు. దీంతో వారంతా కందకర్తి, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి అక్రమ క్వారీ వద్దకు కర్రలతో చేరుకున్నారు. రెచ్చిపోయి ఎస్సై పై తిరగబడ్డారు. కర్రలతో దాడి చేసి గాయపర్చారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.
ఎస్సైపై దాడి విషయం తెలుసుకున్న నాందేడ్ ఎస్పీ ప్రేమ్‌సింగ్ దయా వెంటనే స్పందించారు. ధర్మాబాద్ సీఐ రాజేందర్ సహానే నేతృత్వంలో ప్రత్యేక బలగాలను అక్రమ క్వారీ వద్దకు పంపించారు. అప్పటికే పలువురు పలాయనం చిత్తగించగా మరి కొందరిని పట్టుకుని అక్కడున్న డోజర్, మూడు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి ధర్మాబాద్ ఠాణాకు తరలించారు.
గురువారం నాందేడ్ ఎస్పీ ప్రేమ్‌సింగ్ దయా కందకుర్తి వద్ద గల వంతెన వద్దకు చేరుకుని అక్రమ క్వారీని పరిశీలించారు. ఇసుక మాఫియా ఎంతటిదైనా.. వారి ఆగడాలను అరికడతామని ెహ చ్చరించారు. పోలీసులపై దాడి చేసిన 17మందిపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి నది మహారాష్ట్ర పరిధిలో ఉందని తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవద్దని రెంజల్ ఎస్సై రవికుమార్‌కు సూచించారు.