మహాత్మ గాంధీ హత్యోదంతంగా '1948 అఖండ భారత్'.. మూవీ రివ్యూ
మహాత్మ గాంధీ.. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానుభావుల్లో ప్రముఖులు. ఆయన చేసిన ఎన్నో త్యాగాలు, సత్యాగ్రహం, పోరాటల తర్వాత 1947లో ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించింది. తర్వాత బాపూజీ హత్యోదంతం దేశాన్ని కలచివేసింది. ఈ నేపథ్యంలోనే తెరకెక్కిన చిత్రం '1948 అఖండ భారత్' (1948 Akhanda Bharath). ఈ చిత్రాన్ని ఎమ్వైఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి (Eswarbabu Dhulipudi) దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై. మహర్షి(M.Y Maharshi) నిర్మించారు. ఈ సినిమాలో గాంధీగా రఘనందన్ (Raghu Nandhan), నాథురాం గోడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz), సర్ధార్ వల్లభాయ్ పటేల్‌గా శరద్ దద్భావల (Saradh Dadbhvala ), నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్ (Mohammed Imtiaz), జిన్నాగా జెన్నీ(Jenny), అబ్దుల్ గఫర్ ఖాన్‌గా సమ్మెట గాంధీ (Sammeta Gandhi) ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాంధీ హత్యోదంపై నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
బ్రిటీష్ పాలకులు భారత దేశానికి స్వాతత్య్రం ప్రకటించిన అనంతరం దేశ విభజన జరిగి.. హిందూ, ముస్లింల మధ్య మతకలహాలు జరిగాయి. అందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాందిశీకులుగా భారత దేశానికి వచ్చేశారు. దానికి ప్రతీకారంగా ఇండియాలో ఉన్న ముస్లింల పైనా దాడులు జరిగాయి. ఈ మత కల్లోలాను ఆపి.. విభజన సమయంలో పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు ఇవ్వాలన్న హామీని అమలు పరచలాని ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. ఈ నిరాహార దీక్ష.. కొంత మంది హిందూ మహాసభ సభ్యులకు ఎలా ఆగ్రహం కలిగించింది? అందులో ముఖ్య సభ్యులైన వీర సావర్కర్ శిష్యులు నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టే, అతని మిత్ర బృందం గాంధీని చంపడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటీ? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దేశ విభజన వల్ల భారతదేశం భౌగోళకంగా.. ఆర్థికంగా.. సామాజికంగా.. సాంస్కృతికంగా చిన్నాభిన్నమైంది. అందుకు కారణం అప్పటి బ్రిటీష్ పాలకులు ఒక కారణంగా.. మరో వైపు అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, వారితో పాటు అహింసా వాది అయిన జాతిపిత గాంధీ మరో కారణంగా వాదనలు వినిపించాయి . శాంతి... శాంతి అంటూ ఓ వైపు పాకిస్తాన్ కి వంత పాడటం వల్ల ఆయన ప్రాణాలనే వొదలాల్సి వచ్చిందని గాడ్సే వాదుల వాదన. ఈ అంశాన్నే '1948 అఖండ భారత్'లో రచయిత చూపించారు. అహింసా వాది, సత్యాగ్రహి అయిన గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, ఆయన మరణానంతరం జరిగిన ఇన్వెస్టిగేషన్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గాంధీ హత్య కేసులో ఉరి తీయబడ్డ నాథురామ్ గాడ్సే, నారాయణ అప్టేల మృత దేహాలను దహనం చేసిన స్థలంలో అమర వీరుల స్తూపాలు నిర్మిస్తారని భావించి, ఎవరికీ తెలియకుండా దహనం చేయడం లాంటి భావోద్వేగ అంశాలు ఎంతో హృద్యంగా తెరపై చూపించాడు దర్శకుడు. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని మూలన పడిన సంఘటనలు ఈతరం యువతకి తెలిసేలా ఉంది ఈ సినిమా.
ఎవరెలా చేశారంటే?
ఈ చిత్రంలో గాంధీ పాత్రలో రఘనందన్ (Raghu Nandhan) బాగా ఆకట్టుకున్నాడు. హావ భావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా కుదిరాయి. ఇక కీలక రోల్ నాథురాం గోడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్ (Arya Vardhan Raaz) అలరించాడు. ఎందుకంటే ఈ పాత్రకి గాంధీలా పెద్దగా రిఫరెన్స్ కూడా మనకి చరిత్రలో కనిపించవు. గాంధీని హత్య చేసిన హంతకుడిలాగే మనం చదివాం, విన్నాం. ఇందులో అయితే గాడ్సే ఓ అభ్యుదయ భావాలు ఉన్న బ్రాహ్మణ యువకునిగా గాడ్సే ఎంత అగ్రెసివ్ గా ఉండేవారో ఆర్య వర్ధన్ రాజ్ బాగా చేసి చూపించారు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ లో భావోద్వేగంతో చెప్పిన డైలాగులు చాలా కన్వెన్సింగ్ గా ఉన్నాయి. నారాయణ అప్టే పాత్రధారి బాగా చేసాడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఆర్య వర్ధన్ రాజ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసిన కథ, కథనాలను దర్శకుడు ఈశ్వర్ డి. బాబు తెరమీద బాగా చూపించారు. ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం బాగుంది. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. 1948 నాటి పరిస్థితులను బాగా చిత్రీకరించారు. అందుకు తగినట్టుగా ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత ఎం. వై. మహర్షి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించారు. ఈతరం యువత తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.